రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు : నళిని శ్రీహరన్‌

8 Sep, 2018 09:10 IST|Sakshi
రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నేరస్తురాలు నళిని శ్రీహరన్‌(ఫైల్‌ ఫోటో)

చెన్నై : ‘రాహుల్‌ గాంధీకి చాలా చాలా ధన్యవాదాలు. ఆయన హృదయం చాలా విశాలమైనది. అం‍దువల్లనే తన తండ్రిని హత్య చేసిన మమ్మల్ని క్షమించారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌. ‘తమ తండ్రిని హత్య చేసిన వారి పట్ల తమకు కోపం లేదంటూ.. వారిని క్షమించానని’ రాహుల్‌ గాంధీ ప్రకటించిన నేపథ్యంలో నళిని శ్రీహరన్‌ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం గురించి ఆమె ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో ఉత్తరాల ద్వారా సంభాషించారు.

ఈ సందర్భంగా ఆమె.. ‘ఇప్పటికే నా జీవితంలో చాలా కష్టాలను భరించాను. ఇక మిగిలిన ఈ జీవితాన్ని నా కుమార్తెతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఇప్పుడు నా కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను నా తండ్రి, కూతురితో కలిసి ప్రశాంత జీవనం గడపాలనుకుంటున్నాను’ అని తెలిపారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం తన పట్ల దయగా వ్యవహరిస్తుందన్న  ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితుడైన ఏ జీ పెరరివాలన్‌ చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ని పరిగణలోకి తీసుకోవాలంటూ అప్పటి తమిళనాడు సీఎం జయలలిత.. కేంద్రానికి లేఖ రాశారు.

ఈ విషయంపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడుగురిని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేంద్రం అంగీకారం లేకుండా రాష్ట్రాలు ఖైదీలను విడుదల చేయడం కుదరదని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక రాజీవ్‌ హత్య కేసులో నిందితులను విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. వీరితో పాటు ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర సుప్రీం కోర్టుకు విన్నవించింది.

కానీ నళిని మాత్రం కేంద్ర ప్రభుత్వం తన పట్ల ఔదార్యం చూపిస్తుందని.. తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తుందని నమ్మకంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వెల్లూరులో శిక్ష అనుభవిస్తున్న నళిని ప్రపంచంలోనే అత్యధిక కాలం జైలు జీవితం గడిపిన మహిళా ఖైదీగా గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు