‘నమస్తే ట్రంప్‌’తోనే వైరస్‌ వ్యాప్తి..!

31 May, 2020 15:16 IST|Sakshi

సాక్షి, ముంబై : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిపై శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలో కరోనా విజృంభణకు గుజరాత్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం కారణమంటూ సామ్నా ఎడిటోరియల్‌ వేదికగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షడు డోనాల్డ్‌ ట్రంప్‌తో పాటు పలువురు అమెరికా ప్రతినిధులు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు లక్షమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 24న జరిగిన ఈ కార్యక్రమంతోనే దేశంలో కరోనా వ్యాప్తి మరింత పెరిగిందని రౌత్‌ ఆరోపించారు. (ఒక్క రోజే 8,380 కరోనా కేసులు)

గుజరాత్‌తో పాటు ముంబై, ఢిల్లీల్లో అమెరికా ప్రతినిధులు పర్యటించారని, వారి మూలంగానే కోవిడ్‌ తీవ్ర రూపందాల్చిందని పేర్కొన్నారు. అప్పటికే చైనాతో పాటు అమెరికా, ఇటలీ, యూరప్‌ దేశాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూశాయని, అయినప్పటికీ ప్రధాని మోదీ నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్ని వాయిదా వేయలేదని విమర్శించారు.  దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. (ఆక్సిజన్‌ లేక కోవిడ్‌ బాధితులు మృతి)

ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణపై కూడా సామ్నా వేదికగా స్పందించారు. అత్యధిక జనసాంధ్రత కారణంగానే ముంబైలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని రౌత్‌ పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిని సాకుగా చూపించి రాష్ట్రంలో రాష్ట్రపతి విధించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్‌ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్రలోనే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోనూ వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని గుర్తుచేశారు. ఇక కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర విధించిన లాక్‌డౌన్‌ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు