హౌడీ X నమస్తే

23 Feb, 2020 04:34 IST|Sakshi

భారీ కార్యక్రమాల్లో ట్రంప్, మోదీ

ఇరు దేశాల మధ్య బంధాలు బలపడతాయా ?

సారొస్తున్నారు...
మాటల తూటాలతో జాతీయ భావాన్ని రెచ్చగొట్టినా .. ప్రపంచ దేశాలపై నోరు పారేసుకొని వివాదాల కుంపట్లు రాజేసినా..దూకుడు నిర్ణయాలతో సొంత పార్టీలోనూ, మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొన్నా..  అదరలేదు. బెదరలేదు. ఎప్పుడూ తలవంచలేదు.   అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ .. చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో..  ఎన్నారైలు హెచ్‌1బీ వీసా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో..  కశ్మీర్‌ అంశంలో మూడోవ్యక్తి జోక్యాన్ని సహించబోమని భారత్‌ తేల్చి చెప్పిన నేపథ్యంలో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా భారత్‌ గడ్డపై అడుగు పెడుతున్నారు.  విపక్షాల అభిశంసన తీర్మానాన్ని దీటుగా ఎదుర్కొన్న విజయ దరహాసంతో సారొస్తున్నారొస్తున్నారు.  

మరి ట్రంప్‌ ఏం చేస్తారు?
మన ప్రధానికి షేక్‌ హ్యాండిస్తారా? హ్యాండ్‌నే షేక్‌ చేస్తారా? ఏమో? ఎవరు చెప్పగలరు? వస్తున్నది ట్రంప్‌ కదా...   

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రధాని మోదీ ఆరు నెలలు తిరిగిందో లేదో మళ్లీ భారీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలోని హూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ తరహాలో ఇప్పుడు నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి అహ్మదాబాద్‌ ముస్తాబైంది. హౌడీ మోదీకి కొనసాగింపుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతవరకు ప్రయోజనం?

హౌడీ మోదీ
వేదిక: టెక్సాస్‌ హూస్టన్‌లో ఎన్‌ఎస్‌జీ స్టేడియం
తేదీ: 2019 సెప్టెంబర్‌ 23
హాజరైనవారు: 50 వేల మంది ప్రవాస భారతీయులు

ఎందుకీ కార్యక్రమం?
ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అమెరికా గడ్డపై అడుగు పెట్టినందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్‌లో ఎన్నారైలు పెట్టుబడులు పెట్టేలా, ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమానికి ఊతమిచ్చేలా తన పర్యటన సాగాలని మోదీ అనుకున్నారు. ఇంధనం, వాణిజ్య రంగాల్లో సంబంధాలు మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం బాటలు వేస్తుందని ఇరుపక్షాలు భావించాయి. ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం రద్దు తర్వాత అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు అమెరికా, ఇతర దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరతీశాయి. భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలను విధించింది. ఈ నేపథ్యంలో టెక్సాస్‌ ఇండియా ఫోరమ్‌ నిర్వహించిన ఒక కార్యక్రమానికి మోదీతో పాటు ట్రంప్‌ హాజరుకావడం నాడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగతంగానూ బంధం బలపడి వాణిజ్య, రక్షణ, ఇంధన రంగాల్లో అడుగులు ముందుకుపడ్డాయి. ఆ కార్యక్రమమే ఇప్పుడు ట్రంప్‌ భారత పర్యటనకు దోహదపడింది.

నమస్తే ట్రంప్‌
తేదీ: 2020 ఫిబ్రవరి 24
వేదిక : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మొటెరా స్టేడియం
హాజరయ్యే వారు: లక్ష మందికి పైగానే..

ఎందుకీ కార్యక్రమం?
అమెరికాకు అధ్యక్షుడయ్యాక ట్రంప్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. అందుకే హౌడీ మోదీ కార్యక్రమాన్ని మించి భారత్‌లో ఘన స్వాగతం తెలపడానికి గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా రికార్డు సృష్టించనున్న మొటెరా స్టేడియంలో లక్ష మందిని ఉద్దేశించి ట్రంప్, మోదీలు ప్రసంగించనున్నారు. తనపై అభిశంసన తీర్మానంలో నెగ్గి నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్న ట్రంప్‌ భారత్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

గత ఎన్నికల్లో ప్రవాస భారతీయులందరూ డెమొక్రాట్లకే అండగా నిలిచారు. ఆసియా అమెరికన్‌ సర్వే ప్రకారం డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 84 శాతం మంది ఓటు వేస్తే, ట్రంప్‌కు భారతీయుల ఓట్లు 14 శాతమే పడ్డాయి. ప్రస్తుతం అధ్యక్ష అభ్యర్థుల ఎన్నిక కోసం రాష్ట్రాల స్థాయిలో ప్రాథమికంగా ఓటింగ్‌ కొనసాగుతోంది. 2018 నాటికి అమెరికాలో 26.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అమెరికాలోని విదేశీయుల్లో 5.9 శాతం మంది భారతీయులే. గత సారి ఓటు వెయ్యని వారిని ఈ సారి తన వైపు తిప్పుకోవడానికి, చైనాతో వాణిజ్యపరమైన యుద్ధం నడుస్తూ ఉండడంతో, భారత్‌కు తాము ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పడానికి ఈ పర్యటన సాయపడుతుందనే ట్రంప్‌ భావిస్తున్నట్లు రాజకీయ పండితుల విశ్లేషణ.

విదేశంలో లక్ష మంది హాజరయ్యే ఒక భారీ కార్యక్రమంలో మాట్లాడే తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అవుతారు. అధ్యక్ష ఎన్నికలవేళ ఇవన్నీ తనను ‘ప్రపంచంలో అగ్రనేత’గా నిలబెడతాయని ట్రంప్‌ భావిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ డెమొక్రాట్లకు, రిపబ్లికన్లకు సమదూరం పాటిస్తోంది. అయితే ఇప్పుడు దేశంలో ఆర్థికమందగమన పరిస్థితుల్లో రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాల్లో భారత్‌కు అమెరికా సాయం చాలా అవసరం. అలా ‘విన్‌ అండ్‌ విన్‌’ పాలసీతో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వంలో కన్సల్టెంట్‌గా పనిచేసిన ఆత్మన్‌ ఎం త్రివేది అభిప్రాయపడ్డారు.

మోదీ కలల ప్రాంగణం
నరేంద్ర మోదీ గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (జీసీఏ) చీఫ్‌గా ఉండగా భారీ క్రికెట్‌ స్టేడియం నిర్మించాలన్న తలంపు ఆయనకు వచ్చింది. 2014లో మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా జీసీఏ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న స్టేడియాన్ని కూల్చేసి ఈ నూతన స్టేడియాన్ని నిర్మించారు. మోదీ కలగన్న ఆనాటి క్రికెట్‌ క్రీడా మైదానంలో ఈ రోజు పెద్దన్నకు ఘనస్వాగతం లభిస్తోంది. ఈ అందమైన, అధునాతనమైన, అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంపై ఓ లుక్కేద్దాం.  


     
స్టేడియం పేరు: సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్టేడియం
గతంలో పేరు: సర్దార్‌ పటేల్‌ గుజరాత్‌ స్టేడియం
     ఎగ్జిక్యూటివ్‌ సూట్స్‌: 76
     సీటింగ్‌ కెపాసిటీ: 1,10,000
     విస్తీర్ణం: 63 ఎకరాలు
     తొలిసారి నిర్మాణం: 1982
     పాత స్టేడియం కూల్చివేత: 2015
     పునర్నిర్మాణం ప్రారంభం: 2017– 20
     ఆర్కిటెక్ట్‌: పాపులస్‌ (కొత్త నిర్మాణం), శశి ప్రభు (పాత నిర్మాణం)
     ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంకన్నా పెద్దది.  
     నిర్మాణం ఖర్చు: రూ. 800 కోట్లు
     పార్కింగ్‌ ఏరియా: ఏకకాలంలో 3000 కార్లను, 10 లక్షల ద్విచక్ర వాహనాలను పార్క్‌ చేయొచ్చు.


శనివారం పూరిలోని సముద్రతీరంలో రూపొందించిన డొనాల్డ్‌ ట్రంప్, మెలానియాల సైకత శిల్పం.

మరిన్ని వార్తలు