నంబీ నారాయణన్‌కు భారీగా నష్టపరిహారం

27 Dec, 2019 15:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) మాజీ శాస్త్రవేత్త ఎస్.నంబి నారాయణన్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. 1994 ఇస్రోలో గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్‌ చేసి.. వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు క్లీన్‌చిట్‌ లభించడంతో.. తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ తిరువనంతపురంలోని కోర్టులో ఇటీవల నంబి నారాయణన్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆయనకు సంబంధించిన కేసును విచారించడానికి మాజీ ప్రధాన కార్యదర్శి జయకుమార్‌ను నియమించింది. జయకుమార్‌ సిఫార్సుల మేరకు రూ.1.3 కోట్లు నష్టపరిహారం ఇచ్చేందుకు కేరళ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. 

వివరాల్లోకి వెళ్తే..1994లో నంబి నారాయణన్‌ గూఢచర్యానికి పాల్పడి విదేశాలకు ఇస్రో రహస్యాలను చేరవేశారనే ఆరోపణలతో అరెస్ట్‌ చేశారు. రహస్యాలను చేరవేయడంలో ఇద్దరు శాస్త్రవేత్తలతో పాటు మరో నలుగురి(ఇద్దరు మాల్దీవ్‌ మహిళలు) భాగస్వామ్యం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సీబీఐ కోర్టు, సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చినప్పటికీ.. అప్పటికే ఆయన 50 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఈ 50 రోజుల కస్టడీలో తనను పోలీసులు చిత్రహింసలు పెట్టారని నంబి నారాయణన్ ఆరోపించారు. తనను అనవసరంగా అరెస్ట్‌ చేశారంటూ సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు.

అదే విధంగా తనపై అక్రమ కేసులు పెట్టిన మాజీ డీజీపీ సీబీ మాథ్యూస్, ఇద్దరు రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్లు కేకే జాషువా, ఎస్ విజయన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కేరళ హైకోర్టును కోరినా  స్పందించలేదని నంబి నారాయణన్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో నంబి నారాయణన్‌కు రూ. 50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సైతం రూ. 10లక్షలు ఇవ్వాలని సిఫార్సు చేసింది. కాగా నంబి నారాయణన్‌ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నారాయణన్‌ పాత్రలో మాధవన్‌ నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు