నానో దారి... బంగారు దారి!

31 Mar, 2017 04:12 IST|Sakshi
నానో దారి... బంగారు దారి!

వచ్చే నెల లండన్‌లో ఓ కార్‌ రేస్‌ జరగబోతోంది! ఫార్ములా –1 రేసు కాదండోయ్‌! అలాగని వింటేజీ కార్ల పోటీ అనుకునేరు అది కూడా కాదు. నానో కార్ల రేసు! ఓహో... టాటా కంపెనీ తయారు చేసే నానో కార్లకు సంబంధించిందనుకుంటూ ఉంటే మీరు మళ్లీ తప్పులో కాలేసినట్లే. ఇది అచ్చమైన నానో వాహనాల పోటీ. అర్థం కావడం లేదా? ఓకే... శాస్త్ర ప్రపంచంలో నానో మీటర్‌ అంటే ఎంతో తెలుసా మీకు. ఒక మీటర్‌లో వందకోట్లవ వంతు అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే మన వెంట్రుకలో పదోవంతును నానోమీటర్‌ అంటారు.

ఒక హైడ్రోజన్‌ అణువు దాదాపు 20 నానోమీటర్ల సైజు ఉంటుంది. ఇక వచ్చే నెల 28 – 29 తేదీల్లో ఫ్రాన్స్‌లోని టులూస్‌ ప్రాంతంలో జరగబోయేది ఈ స్థాయి వాహనాలతో పోటీనే. దాదాపు 36 గంటలపాటు జరిగే ఈ పోటీలో వంద నానోమీటర్ల సైజున్న వాహనాల్లాంటి అణువులు పోటీపడతాయి. అంతేనా! ఈ పోటీలను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు కూడా. ఇందుకోసం అత్యంత సూక్ష్మ వస్తువులను చూసేందుకు ఉపయోగించే టన్నలింగ్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ను వాడుతున్నారు. ఇదంతా ఎందుకూ అన్న సంశయం వెంటాడుతూంటే... నానోటెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇంత సూక్ష్మస్థాయిలో అణువులను నియంత్రించడం అంత ఆషామాషీ ఏం కాదు.

ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి కొత్త కొత్త పద్ధతులను పరీక్షించేందుకే ఈ పోటీ. ఇంతకీ ఈ పోటీకి వాడే ట్రాక్‌ ఏమిటో తెలుసా? అచ్చమైన బంగారు ఉపరితలం. పోటీ నియమ నిబంధనలూ చాలా స్పష్టం. ఒక్కో కారు 20 నానోమీటర్ల దూరం ప్రయాణించాలి. 45 డిగ్రీల కోణంతో మలుపు తిరిగి మరో 30 నానోమీటర్లు మళ్లీ 45 డిగ్రీల మలుపు తిరిగి ఇంకో 20 నానోమీటర్ల ప్రయాణం... మొత్తమ్మీద వంద నానోమీటర్ల దూరం జరిగే పోటీ.

ఈ పోటీలో మొత్తం నాలుగు బృందాలు పాల్గొంటాయి. ఒక్కో బృందానికి ఒక్కో బంగారు ఉపరితలం ఉంటుంది. మొత్తం 36 గంటల్లో వంద నానోమీటర్ల దూరాన్ని పూర్తి చేయాలి. బంగారు ఉపరితలాన్ని శుభ్రం చేసుకునేందుకు ఆరు గంటల సమయం ఇస్తారు. నానోస్థాయి వాహనాలను నియంత్రించేందుకు అత్యంత సూక్ష్మస్థాయి విద్యుత్‌ ప్రచోదనాలను ఉపయోగిస్తారు.  
 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు