22న జనతా కర్ఫ్యూ

20 Mar, 2020 02:52 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిపై నిర్లక్ష్యం తగదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హితవు పలికారు. వైరస్‌ సోకకుండా, వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాల సూచనలను తు.చ తప్పకుండా పాటించాలని కోరారు. కరోనాపై పోరులో భాగంగా.. ఈ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు దేశ ప్రజలంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ప్రజలే స్వచ్ఛందంగా విధించుకునే ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ఆ రోజు ప్రజలు పూర్తి సమయం తమ ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టకూడదని సూచించారు.

ఈ జనతా కర్ఫ్యూ కరోనాపై పోరులో దేశ ప్రజల నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తుందన్నారు. అలాగే, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనాపై అహర్నిశలు పోరాటం చేస్తున్న వైద్య, పారిశుద్ధ్య, విమానయాన, మీడియా.. తదితర వర్గాల వారికి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు తమ ఇంట్లోనే ఉండి కృతజ్ఞతలు తెలపాలని ప్రధాని కోరారు. గుమ్మం ముందు, లేక బాల్కనీలో, లేక కిటికీ వద్ద నిల్చుని చప్పట్లు కొట్టడం, గంటలు కొట్టడం, సెల్యూట్‌ చేయడం లేదా వీలైన ఇతర విధానాల్లో వారికి కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. 

కనీవినీ ఎరుగని ఉత్పాతం 
కరోనా వైరస్‌ ముప్పు దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని గురువారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మామూలు ఉత్పాతం కాదని, మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలపై ప్రభావం చూపలేదని వ్యాఖ్యానించారు. ప్రపంచం ఇప్పుడు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌–19కి కచ్చితమైన చికిత్స కానీ టీకా కానీ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని దేశ ప్రజలను కోరారు. వ్యక్తిగత స్థాయిలో తీసుకునే చర్యల ద్వారానే ఈ మహమ్మారిని నిరోధించగలమన్నారు. (విమానం దిగగానే క్వారంటైన్‌కే..)

కరోనాపై విజయం సాధించేందుకు తనకు దేశ ప్రజలు తమ సమయం ఇవ్వాలని ప్రధాని కోరారు. ‘నేను ఎప్పుడు, ఏమడిగినా నన్ను మీరు నిరాశ పర్చలేదు. ఇప్పుడు కూడా అభ్యర్థిస్తున్నాను. రానున్న కొన్ని వారాల పాటు మీ సమయాన్ని నాకివ్వండి. ఈ సమయంలో ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితే తప్ప అడుగు బయట పెట్టకండి. ఇంట్లో నుంచే పని చేసేలా చూసుకోండి’ అని అభ్యర్థించారు. 60 ఏళ్ల వయసు దాటినవారు కొన్ని వారాల పాటు ఇల్లు కదలవద్దని సూచించారు. దృఢ సంకల్పంతో, సంయమనం పాటిస్తూ ఈ మహమ్మారిపై యుద్ధం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనాతో భయాందోళనలకు గురై, పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కొనుక్కునే ప్రయత్నాలు చేయవద్దని, అన్ని వేళలా నిత్యావసరాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

నిత్యావసరాలను, ఔషధాలను పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవద్దన్నారు. కరోనా అభివృద్ధి చెందిన దేశాలపైననే ప్రభావం చూపుతుందని, భారత్‌ను ఏమీ చేయదని అనుకోవద్దన్నారు. ‘ఈ ఆలోచనాధోరణి సరైంది కాదు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదు. ప్రతీ భారతీయుడు అప్రమత్తంగా, అత్యంత జాగరూకుడై ఉండాలి’ అని హెచ్చరించారు. సత్వరమే చర్యలు తీసుకున్న కొన్ని దేశాలు ఈ వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొన్నాయన్నారు. ప్రజల సహకారంతో భారత్‌ ఈ వైరస్‌ను జయిస్తుందన్నారు. (కరోనా వ్యాప్తి: ఏంజెలా మెర్కెల్ సంచలన వ్యాఖ్యలు)

>
మరిన్ని వార్తలు