ఠాక్రే ప్రమాణ స్వీకారానికి మోదీ, షాలు వస్తారా ?

27 Nov, 2019 12:18 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో దాదాపు నెలరోజుల పాటు రసవత్తరంగా సాగిన పొలిటికల్‌ డ్రామాకు మంగళవారంతో తెరపడింది. దేవేంద్ర పడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయడంతో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌లకు లైన్‌ క్లియర్‌ అయింది. కాగా, మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన ఛీప్‌ ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం సాయంత్రం దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఠాక్రే ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాలను ఆహ్వానించే విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ' ఠాక్రే ప్రమాణ స్వీకారానికి ప్రతీ ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మోదీ, అమిత్‌ షాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తాం' అని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం పీఠంపై ఇరు పార్టీల మధ్య విబేదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని బయటికి వచ్చింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల తదనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జట్టు కట్టి అధికారంలోకి రానుంది. అయితే వీరి ఆహ్వానాన్ని మన్నించి బీజేపీ నేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. 
(చదవండి : ఉద్దవ్‌ ఠాక్రేకే పీఠం..)

మరిన్ని వార్తలు