ట్రంప్‌కు మోదీకీ పోలికేమిటీ?

10 Nov, 2018 15:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకీ కొన్ని విషయాల్లో పోలికలు ఉన్నాయి. ఇద్దరికి మీడియా అంటే పడదు. పైగా చులకన భావం. దేశ సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం పనిచేసే పాలనాదక్షులమని వారి విశ్వాసం.  మీడియాతో సహా ఎవరైనా సరే తమను ప్రశ్నించరాదనే అహంభావం వారిది. అందుకే నవంబర్‌ ఏడవ తేదీన వైట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డోనాల్డ్‌ ట్రంప్, సీఎన్‌ఎన్‌ జర్నలిస్ట్‌ జిమ్‌ అకోస్టాపై మండిపడ్డారు. మరోసారి వైట్‌హౌజ్‌కు రాకుండా ఆ విలేకరి మీడియా పాస్‌ను కూడా రద్దు చేయించారు.

మెక్సికో నుంచి వస్తున్న వలసదారుల గురించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై విలేకరి ప్రశ్నించినందుకు ట్రంప్‌కు కోపం వచ్చింది. విలేకరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అయినప్పటికీ అకోస్టా పదే పదే అదే ప్రశ్న అడగడంతో ట్రంప్‌ కోపం కాస్తా నసాలానికంటింది. భయంకరుడు, క్రూరుడు అంటూ విలేకరిని తిట్టారు. ఆయన పనిచేసే సీఎన్‌ఎన్‌ ఛానెల్‌ ప్రజావ్యతిరేకి అంటూ ముద్ర వేశారు. నరేంద్ర మోదీకే ఇలాంటి పరిస్థితి అంటే, తనకిష్టం లేని ప్రశ్న అడిగితే ఎలా స్పందిస్తారు? అసలు ఆయనకు అలాంటి పరిస్థితి ఎన్నటికీ రాదు. ఎందుకంటే, ఆయన అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. అది ఆయనకు ఇష్టముండదు.

ఆయన గత ఆగస్టు నెలలో రెండు జాతీయ ఇంగ్లీషు పత్రికలకు, ఓ జాతీయ వార్తా సంస్థకు ఈ మెయిల్‌ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే ఈ మెయిల్‌లో పంపించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇచ్చిన సమాధానాన్ని మళ్లీ ప్రశ్నించేందుకు వీల్లేకుండా ఆ పద్ధతిని పాటించారు. 2015లో నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేయడానికి ఫ్రెంచ్‌ వార్తా పత్రిక ‘లే మండే’ ముందుకొచ్చింది. ఈ మెయిల్‌ ఇంటర్వ్యూ మాత్రమే ఇస్తానని మోదీ చెప్పారు. అందుకు ఆ పత్రిక అంగీకరించకుండా ఇంటర్వ్యూను వదులుకుంది. జనవరిలో మోదీ రెండు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాటిల్లో మోదీ అంతవరకు తన ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పుకుంటూ వచ్చారు. వాటిని ప్రశ్నించే అవకాశం లేకుండా ముందుగా చేసుకున్న అవగాహన మేరకు ఆ రెండు ఇంటర్వ్యూలు, ప్రభుత్వం మీడియాకు విడుదల చేసే ప్రకటనలాగా సాగాయి. మీడియాను తప్పించుకోవడంతోపాటు ప్రజల్లో తమ ప్రతిష్టను ఇనుమడింప చేసుకునేందుకు మోదీ ఎక్కువగా సోషల్‌ మీడియానే వాడుతున్నారు.

ట్రంప్‌కు మీడియా నుంచి ఎన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా ఆయన విలేకరుల సమావేశాలకు దూరం కాలేదు. విలేకరుల పట్ల అదే దురుసును ప్రదర్శిస్తూ వస్తున్నారు. మీడియాకు మొహం చాటేస్తున్న నరేంద్ర మోదీనే మనసు మార్చుకుని విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ‘పెద్ద నోట్ల రద్దు వ్యవహారం, దళితులపై జరిగిన దాడులు, రఫేల్‌ యుద్ధ విమానాల కుంభకోణం, సీబీఐ, ఆర్బీఐ కలహాలు, శబరిమలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, అయోధ్యలో రామాలయ నిర్మాణం తదితర అంశాలపై ఎంత మంది భారత జర్నలిస్టులు జిమ్‌ అకోస్టాలాగా నిలదీయగలరన్నది ప్రశ్నే. భారత మీడియాకే గనుక అంత స్వేచ్ఛ ఉంటే ‘పత్రికా స్వేచ్ఛ’లో 180 దేశాల్లో భారత్‌కు 138వ స్థానం ఎందుకు వస్తుంది? ఆ పరిస్థితి నుంచి పైకి రావాలంటే భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో పోరాడైనా స్వేచ్ఛను నిలబెట్టుకోవాల్సిందే!

మరిన్ని వార్తలు