భారత్‌పై గౌరవం పెరిగింది

29 Sep, 2019 04:06 IST|Sakshi

ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు వచ్చింది

అమెరికా పర్యటన నుంచి వచ్చాక ప్రధాని మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో ప్రపంచం దృష్టిలో భారత్‌ గౌరవం మరింతగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దాదాపు వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ప్రధాని భారత్‌ తిరిగివచ్చారు. విమానాశ్రయానికి భారీగా తరలివచి్చన బీజేపీ కార్యకర్తలు మోదీకి ఘనస్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి విమానాశ్రయం వెలుపల మోదీ కాసేపు మాట్లాడారు. ‘2014లోనూ అమెరికా వెళ్లాను. ఐరాస సమావేశాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు కూడా వెళ్లాను. ఈ ఐదేళ్లలో భారత్‌ పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో భారీ మార్పు చూశాను. భారత్‌ అంటే ఆసక్తి, గౌరవం మరింత పెరిగాయి’ అన్నారు.  హ్యూస్టన్‌లో అట్టహాసంగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, పలువురు డెమొక్రాట్, రిపబ్లికన్‌ పారీ్టల నేతలు హాజరుకావడాన్ని ఆయన ప్రస్తావించారు.

ముఖ్యంగా  ప్రవాస భారతీయుల ఉత్సాహం తననెంతో ఆకర్షించిందన్నారు. మూడేళ్ల క్రితం  పాక్‌ ఆక్రమిత కశీ్మర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మూడేళ్ల క్రితం నాటి ఈ రోజును మర్చిపోలేను. ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు’ అన్నారు.  భారతీయులను గర్వపడేలా చేసిన భారతీయ సైనికుల సాహసానికి గుర్తుగా ఆ రోజు నిలిచిపోతుందన్నారు. భారత్‌కు బయల్దేరే ముందు అమెరికన్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరిచ్చిన ఘన స్వాగతం, ప్రేమ, ఆతిథ్యాలను మర్చిపోలేను’ అన్నారు. తాను పాల్గొన్న వివిధ కార్యక్రమాలు భారత్‌ పురోభివృద్ధికి తోడ్పడతాయని ఆశిస్తున్నానన్నారు.

అమెరికా పర్యటనలో కొన్ని విశేషాలు..
►ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్‌జీఏ) కశ్మీర్‌ అంశంపై మాట్లాడేం దుకు మోదీ నిరాకరించారు. ఈ సమస్య అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేది కాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. భారత్‌ అభివృద్ధి గురించే మోదీ ప్రస్తావించారు.
►ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని పిలుపునిచ్చారే తప్ప పాక్‌ గురించికానీ, కశ్మీర్‌ గురించి కానీ యూఎన్‌జీఏ సదస్సులో ప్రస్తావించలేదు.
►పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రపంచం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలనే ప్రస్తావించి యూఎన్‌జీఏ సదస్సులో మోదీ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారారు.
►పసిఫిక్‌ ఐలాండ్‌ దేశాలు, కరేబియన్‌ దేశాలు న్యూజిలాండ్, ఇరాన్‌ వంటి ఎన్నో దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
►హ్యూస్టన్‌లో గ్లోబల్‌ కంపెనీల సీఈఓలను కలుసుకొని భారత్‌కు పెట్టుబడులు వచ్చేలా మార్గాలు వేశారు. 500 కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయి.
►హ్యూస్టన్‌లో టెల్లూరియన్, పెట్రోనెట్‌ మధ్య కుదిరిన చారిత్రక ఇంధన ఒప్పందంతో భారతీయులకు భారీగా ఉద్యోగాలు కల్పించే అవకాశం కలిగింది.
►హౌడీ–మోదీ’ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్‌ హాజరుకావడం ద్వారా రెండు దేశాల మధ్య మైత్రి మరింత పటిష్టమైంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు