మోదీకి జైకొట్టిన భారత్‌

15 Aug, 2019 03:16 IST|Sakshi

ప్రధాని మోదీ పాలన బాగుందని 71 శాతం మంది కితాబు

దేశంలోనే నాలుగో అత్యుత్తమ సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఇండియా టుడే–కార్వీ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి మరోసారి భారత్‌ జైకొట్టింది. మోదీ పాలన బాగుందని 71 శాతం మంది చెప్పినట్లు ఇండియాటుడే–కార్వీ సర్వే తెలిపింది. పాక్‌ను మోదీ ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటున్నట్లు 75 శాతం మంది ప్రజలు అంగీకరించారని వెల్లడించింది. ఇక మోదీ పనితీరుపై తాము సంతృప్తిగా ఉన్నామని 69 శాతం మంది చెప్పినట్లు పేర్కొంది. కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,  కర్ణాటక సహా 19 రాష్ట్రాల్లో  ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరుతో ఈ సర్వేను చేపట్టారు. జులై 22 నుంచి 30 వరకూ దేశవ్యాప్తంగా 12,126 మందిని ఇంటర్వ్యూ చేశారు. వీరిలో 67 శాతం మంది గ్రామీణులు కాగా, 33 మంది పట్టణ ప్రాంతావాసులు కావడం గమనార్హం.

కులతత్వమే ప్రధాన ముప్పు..
భారత అంతర్గత భద్రతకు కుల హింస ప్రధాన ముప్పుగా మారిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. కులహింస కారణంగా ముప్పుందని 25 శాతం మంది తెలపగా, సీమాంతర ఉగ్రవాదం ప్రమాదకరమని 25 శాతం మంది, మత హింసతో జాతిభద్రతకు ముప్పుందని 23 శాతం మంది తెలిపారు. కాగా, అసహనంతో జరిగే దాడులు అంతర్గత భద్రతకు ప్రమాదకరమని కేవలం 10 శాతం మంది మాత్రమే చెప్పారు. సర్వేలో ముఖ్యాంశాలు..

► అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్‌కు 61 శాతం మంది ఆమోదం తెలపగా, 32 శాతం మంది వ్యతిరేకించారు. ఈ సర్వేలో పాల్గొన్న ముస్లింల్లో 33 శాతం మంది రామమందిరం నిర్మించాలని కోరడం గమనార్హం.

► ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో ముస్లిం మహిళలకు సాధికారత చేకూరుతుందని 66 శాతం మంది చెప్పగా, సాధికారత చేకూరదని 24 మంది తెలిపారు. ఈ నిర్ణయాన్ని సర్వేలో పాల్గొన్న ముస్లింలలో 49 శాతం(పురుషులు 47 శాతం, మహిళలు 50 శాతం) మంది సమర్థించారు

► యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి అని సర్వేలో పాల్గొన్న 20 శాతం మంది తెలపగా, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌(10 శాతం మంది) రెండోస్థానంలో నిలిచారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, కేజ్రీవాల్, నవీన్‌ పట్నాయక్‌(8 శాతం) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ జాబితాలో 7 శాతం మంది మద్దతుతో నాలుగో స్థానంలో నిలిచారు. అతి స్వల్ప కాలంలోనే వైఎస్‌ జగన్‌ ఈ ఘనత సాధించడం విశేషం. ఐదోస్థానంలో బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఉన్నారు.
 

► మోదీ ఇమేజ్‌ కారణంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని 35 శాతం మంది తెలిపారు. ఇక బాలాకోట్‌ దాడుల వల్ల గెలుపొందిందని 16 శాతం మంది, ప్రకటనలపై ఖర్చుతో విజయం సాధించారని  8 శాతం చెప్పారు.

► బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం మంచిదేనని 64% మంది తెలపగా, దేశంలో నియంతృత్వం నెలకొనే ప్రమాదముందని  27% మంది  అన్నారు.

► విపక్షాలకు ఓ ప్రధాని అభ్యర్థి అంటూ లేకపోవడం వల్లే యూపీఏ ఓడిపోయిందని  31 శాతం మంది చెప్పారు. విపక్షాల మధ్య అనైక్యత కారణమని 21 శాతం మంది చెప్పారు.

► ప్రస్తుతం ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీయే సరైన నేతని సర్వేలో తేలింది. ఈ సర్వేలో మమతకు 19 శాతం మంది ప్రజలు జైకొట్టగా, ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు 12 శాతం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 12 శాతం మంది మద్దతు తెలిపారు.

► కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తుందని 66 శాతం మంది చెప్పారు.

అత్యుత్తమ ప్రధాని మోదీ
ఇప్పటివరకూ భారత ప్రధానిగా పనిచేసినవారిలో మోదీనే అత్యుత్తమని తేలింది. ఈ సర్వేలో 37 శాతం మంది మోదీనే అత్యుత్తమం అని చెప్పగా, ఇందిర 14 శాతం, వాజ్‌పేయి 11 శాతం,  నెహ్రూ 9 శాతం, మన్మోహన్‌ 5శాతంఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచారు. రాబోయే ఐదేళ్లలో కశ్మీర్‌ సమస్యను మోదీ పరిష్కరిస్తారా? అనే ప్రశ్నకు 65 శాతం మంది అవునని జవాబిచ్చారు. ఇక పాక్‌ విషయంలో మోదీ సర్కారు సరిగ్గానే వ్యవహరిస్తోందని ఏకంగా 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోదీ బలమైన నేత అని 18 శాతం, అన్నివర్గాలను కలుపుకుని వెళుతున్నారని 15 శాతం చెప్పారు. పాకిస్తాన్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరపరాదని 65 శాతం మంది చెప్పగా, చర్చలు జరపాలని 27 శాతం మంది సూచించారు. ప్రధాని మోదీ సాధించిన అతిపెద్ద విజయం అవినీతి నిర్మూలనే అని 20 శాతం మంది చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడం(11 శాతం), పెద్ద నోట్లరద్దు(10) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని వార్తలు