‘నిఘా’ ను పంచుకోవాలి

17 Jul, 2016 04:02 IST|Sakshi
‘నిఘా’ ను పంచుకోవాలి

- ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి
- 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ప్రధాని మోదీ
- కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి
- పరస్పర సాయంతో ముందుకు సాగుదాం
- రాష్ట్రాలకు 21 శాతం పెరిగిన కేంద్ర సాయం
- యువతలో నైపుణ్యాల్ని పెంపొందించాలి

 
 సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయాల్ని పక్కన పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిఘా సమాచారాన్ని పంచుకోవడంపై రాష్ట్రాలు దృష్టిపెట్టాలని, తద్వారా ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించకూడదన్నారు.
 
 అంతర్గత భద్రత సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరస్పర సహకారంతో ముందుకు సాగడమే మార్గమని మోదీ పేర్కొన్నారు. పోలీసు బలగాల ఉనికి నగరాల్లో అన్నివేళలా కొట్టొచ్చినట్లు కనిపించాలని ప్రధాని నొక్కిచెప్పారు. అలాగే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి విస్తృత సీసీటీవీ కవరేజీ ముఖ్యమన్నారు. ప్రైవేటు (వ్యక్తులు, సంస్థలు, కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకునే) సీసీటీవీలు ఈ దిశగా ఇతోధికంగా తోడ్పడతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల బలోపేతానికి అంతరాష్ట్ర మండలి ప్రధాన వేదికని, ఒక్క తాటిపై నడిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
 
 కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెరిగింది: మోదీ
 ‘ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చొరవతో 2006 తర్వాత మండలి సమావేశమవడం సంతోషకరం. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల్ని ఆమోదించడంతో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 32 నుంచి 42 శాతానికి పెరిగింది. 2014-15తో పోల్చితే 2015-16లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు సాయం 21 శాతం పెరిగింది. 14వ ఆర్థిక సంఘం హయాంలో మున్సిపాలిటీలు, పంచాయతీలు రూ. 2.87 లక్షల కోట్లు అందుకోనున్నాయి. సహజ వనరులు, బొగ్గు క్షేత్రాల వేలంతో వచ్చే రెవెన్యూలో రాష్ట్రాల వాటాల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. ఈ వాటాలతో రానున్న కాలంలో రాష్ట్రాలకు మరో. రూ. 3.35 లక్షల కోట్లు అందుతాయి. ఇతర గనుల వేలంతో మరో రూ. 18 వేల కోట్లు సమకూరుతాయి. ‘కంపా’ యాక్ట్‌కు సవరణలతో బ్యాంకుల్లో మూలుగుతున్న రూ. 40 వేల కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేస్తాం. వ్యవస్థలో పారదర్శకతతో వచ్చే ఫలితాలను రాష్ట్రాలతో పంచుకోవడానికి కేంద్రం ఆసక్తిగా ఉంది’ అని మోదీ తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై ఏకాభిప్రాయానికి ఇది సరైన వేదికని ప్రధాని పేర్కొన్నారు.
 
 సాధికారతకు చిహ్నంగా ఆధార్
 నగదు ప్రత్యక్ష బదిలీకి ఆధార్ చట్టం ఉపయోగపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో 79 శాతం ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, దీంతో ఈ ఏడాది చివరి నాటికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేరువవుతుందని, సాధికారతకు  ఆధార్ చిహ్నంగా మారిందని ప్రధాని అన్నారు. సామాజిక సంస్కరణలు అభివృద్ధి మార్గాలని, భారతదేశంలో సంస్కరణలకు మిత్రుల కంటే విమర్శకులు ఎక్కువ  అన్న అంబేడ్కర్ మాట లను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
 గవర్నర్ పదవి రద్దు చేయాలి: నితీశ్ కుమార్
 హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట ప్రభుత్వాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని, అభివృద్ధి పథకాల్ని రూపొందించి వాటిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాల సమాఖ్యను(ఫెడరల్)్ర పోత్సహించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.  సమావేశంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రసంగిస్తూ... గవర్నర్ పదవిని రద్దు చేయాలని సూచిం చారు. ప్రస్తుతమున్న ఫెడరల్ ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ పదవి కొనసాగింపు అవసరం లేదన్నారు. పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ మాట్లాడుతూ రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తోందన్నారు.
 
 రాష్ట్ర జాబితాలోని అంశాలను తొలుత ఉమ్మడి జాబితాలోకి, ఆపై కేంద్ర జాబితాకు మార్చడం ద్వారా రాష్ట్రాల అధికారాలను కేంద్రం హస్తగతం చేసుకుంటోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించి వేస్తుండటంతో రాష్ట్రాలు యాచకుల స్థాయికి పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  యూపీ, తమిళనాడు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ సీఎంలు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎప్పుడూ మోదీపై విరుచుకుపడే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం బిహార్ సీఎం నితిష్‌తో కరచాలనం చేస్తూ ఉత్సాహంగా కన్పించారు.
 
 ప్రధాన బలం యువతే
 ‘దేశానికి ప్రధాన బలం యువత. ప్రస్తుతం 30 కోట్ల మంది పాఠశాల విద్య అభ్యసిస్తున్నారు. రాబోయే కొన్నేళ్లకు సరిపడా నైపుణ్యం కలిగిన మానవవనరులను ప్రపంచానికి అందించే శక్తి మనకుంది. వీరందరి నైపుణ్యాల్ని పెంపొందించడానికి అవసరమైన చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పినట్టుగా విద్య అనేది పెట్టుబడి... విద్యపై పెట్టుబడి భవిష్యత్తులో తప్పకుండా ఫలాలు అందిస్తుంది. విద్య ఆవశ్యకతను వివరిస్తే... విద్యార్థుల్లో ప్రమాణాలు మెరుగుపడతాయి’ అని మోదీ అభిప్రాయపడ్డారు. స్వామి వివేకానంద చెప్పినట్టు విద్య వ్యక్తిత్వాన్ని పెంపొందించాలని, దేశ యువతలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విద్యలో ప్రావీణ్యం సాధించడానికి అవసరమైన అవకాశాలను కల్పించాలని మోదీ అన్నారు.

మరిన్ని వార్తలు