మీకంటే మేం గొప్ప అనే వైఖరి వీడాలి

15 May, 2016 01:52 IST|Sakshi
మీకంటే మేం గొప్ప అనే వైఖరి వీడాలి

ఉగ్రవాదం, భూతాపోన్నతి అతిపెద్ద సవాళ్లు: మోదీ
 
 ఉజ్జయిని: ఉగ్రవాదం, భూతాపోన్నతి ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా మారాయని, ‘మీకంటే మేం గొప్ప’ అనే వైఖరే వీటి వెనుక ప్రధాన కారణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలను అధిగమించడానికి.. వివాదాల పరిష్కారానికి ‘మీ కంటే మేం గొప్ప’ అనే వైఖరిని విడనాడటమే ఏకైక మార్గమని సూచించారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘సరైన మార్గంలో జీవించటం’పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును శనివారం  మోదీ ప్రారంభించారు.

‘భూతాపోన్నతి, ఉగ్రవాదాలకు పరిష్కారం ఏమిటి? వీటి పుట్టుకకు కారణం ఏమిటీ? మీ కంటే మేం పవిత్రులం అనే వైఖరే(ఆలోచన) దీనికి ప్రధాన కారణం. మీ దారి కన్నా నా దారే సరైనది అనుకోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే మనల్ని వివాదాలవైపు నడిపిస్తోంది’ అని అన్నారు. వివాదాలను ఎలా పరిష్కరించాలో భారతీయులకు బాగా తెలుసని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 51 పాయింట్ల సింహస్థ డిక్లరేషన్‌ను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లతో కలసి మోదీ విడుదల చేశారు. భారత్‌లో బౌద్ధ విస్తరణకు కృషి చేసిన అంగారిక ధర్మపాల విగ్రహాన్ని సిరిసేన సాంచిలో ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు