అల్లరిమూకలపై కఠిన చర్యలు

9 Mar, 2019 02:44 IST|Sakshi

కశ్మీరీలపై దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశం

కాశీవిశ్వనాథుడ్ని విపక్షాలు 70 ఏళ్లుగా పట్టించుకోలేదని వ్యాఖ్య

కాన్పూర్‌/వారణాసి/రన్సాయ్‌/న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు చేస్తున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. లక్నోలో ఇటీవల కశ్మీరీ వ్యాపారులపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. కశ్మీరీ సోదరులపై లక్నోలో దాడిచేసిన మూర్ఖులపై యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోదీ, లక్నో ఉత్తర–దక్షిణ కారిడార్‌ మెట్రో సేవలను ప్రారంభించారు.

సహాయ నిరాకరణ చేశారు..
కాశీవిశ్వనాథ్‌ ఆలయం అప్రోచ్‌ రోడ్డు–సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ..‘యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కారణంగా మొదటి మూడేళ్లు వారణాసిలో సహాయ నిరాకరణ ఎదురైంది. అందువల్లే వారణాసి సుందరీకరణ ప్రాజెక్టు ఆలస్యమైంది. కానీ మీరు(ప్రజలు) యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాక ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంది. ఈ విషయంలో గత ప్రభుత్వాలు సహకారమందించి ఉంటే ఇప్పుడు శంకుస్థాపన కాకుండా ప్రాజెక్టును ప్రారంభించి ఉండేవాళ్లం. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా బాబాను (కాశీ విశ్వనాథుడ్ని) పట్టించుకోలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. అందుకే ‘నువ్వు(మోదీ) ఎక్కువగా మాట్లాడుతావు. ఇప్పుడు ఇక్కడికి(వారణాసి)కి వచ్చి ఏదైనా చేయ్‌’ అని ఆ పరమశివుడు నిర్ణయించి ఉంటాడు. కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ ప్రాజెక్టులో భాగస్వామి కావడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు