బీజేపీ భేటీలో మోదీ ఉద్వేగం

21 Dec, 2017 03:48 IST|Sakshi

గుజరాత్‌ విజయంపై ప్రతిపక్షాల ప్రచారం నమ్మొద్దు

పార్టీలో యువ నేతలని ప్రోత్సహించాలి

పార్టీ పార్లమెంటరీ భేటీలో ఉద్వేగభరిత ప్రసంగం

సాక్షిప్రతినిధి, న్యూఢిల్లీ: జనసంఘ్‌ నుంచి నేటి వరకు పార్టీ విజయ ప్రస్థానాన్ని, పార్టీలో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం బుధవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని ఉద్వేగభరితంగా  ప్రసంగించారు. గుజరాత్‌లో పార్టీ అభివృద్ధికి అవిశ్రాంత కృషి చేసిన జనసంఘ్‌ నేతలు మక్రంద్‌ దేశాయి, అరవింద్‌ మణియార్, వసంత్‌రావు గజేంద్రగడ్కర్‌లను ప్రత్యేకంగా గుర్తుచేసిన మోదీ.. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. ప్రసంగం సందర్భంగా దాదాపు మూడు సార్లు ప్రధాని కన్నీళ్లను ఆపుకున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరాన్ని, యువతకు పార్టీలో ప్రాధాన్యత కల్పించాల్సిన ఆవశ్యకతను  గుర్తు చేశారు.

విపక్ష ప్రచారం నమ్మొద్దు!
గుజరాత్‌లో ఆరోసారి అధికారంలోకి రావడం, ఓట్ల శాతం పెరగడం బీజేపీకి భారీ విజయమని, నైతిక విజయం తమదేనన్న ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు ప్రధాని సూచించారు. ఎన్నికల్లో విజయానికి బూత్‌ స్థాయి నుంచి కార్యాచరణ ఎంతో కీలకమని చెప్పారు.

వాజ్‌పేయ్‌ అభినందించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీని కిందిస్థాయి నుంచి పటిష్టం చేయటంతోపాటు యువ నేతల్ని ప్రోత్సహించాల్సి ఉందని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లో పార్టీ నిర్మాణానికి అప్పటి నేతలు పడ్డ శ్రమ.. మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ వంటి సీనియర్లు యువనేతలను ఎలా తీర్చిదిద్దారనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లో బీజేపీ మంచి ప్రదర్శన చూపడంతో అప్పటి ప్రధానిగా ఉన్న వాజ్‌పేయ్‌ తనను అభినందించిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి బీజేపీకి కొత్తగా వచ్చానని, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన గురించి పార్టీలో పెద్దగా ఎవరికీ తెలియదని చెప్పారు.   తన కంటే వయసులో 14 ఏళ్లు చిన్నవాడైన అమిత్‌ షాతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

మూడున్నరేళ్లలో 19 రాష్ట్రాలకు..
1985 అనంతరం ఈ ఎన్నికల్లో గుజరాత్‌లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు సాధించగా.. 1990 తర్వాత బీజేపీ అతి తక్కువగా 99 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో నైతిక విజయం తమదేనన్న కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు. కేవలం మూడున్నరేళ్ల వ్యవధిలో కేంద్రంలో ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇన్ని అద్భుత ఫలితాలు సాధించలేదన్నారు. ‘ఇందిరా హయాం లో కాంగ్రెస్‌ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే బీజేపీ ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అతి తక్కువ సమయంలో బీజేపీ ఈ ఘనత ను సొంతం చేసుకుంది’ అని చెప్పారు.  

మరిన్ని వార్తలు