రాణి పునరాగమనం

9 Dec, 2013 01:15 IST|Sakshi


 పోయినచోటే వెతుక్కొమ్మన్నారు. వసుంధర రాజె సింధియా కూడా సరిగ్గా అదే చేశారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా ఐదేళ్ల క్రితం తన చేజారిన అధికారాన్ని, అదే పార్టీని ఏకతాటిపై నడిపించడం ద్వారా ఇప్పుడు హస్తగతం చేసుకున్నారు. గ్వాలియర్‌ను పాలించిన సింధియా రాజవంశానికి చెందిన 60 ఏళ్ల రాజెది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. సంప్రదాయ రాజస్థానీ గిరిజన వేషధారణతో గ్రామీణ మహిళలతో కలగలిసిపోయి వారి సమస్యలను ఓపిగ్గా ఆలకించినా, రాహుల్‌దేవ్ వంటి మోడల్స్‌తో కలిసి రాంప్ వాక్ చేసినా ఆమెకే చెల్లింది.
 
 బీజేపీ వ్యవస్థాపక సభ్యురాలు విజయరాజె సింధియా కూతురు, దివంగత కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా సోదరి అయిన రాజె ముంబై యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. రాజస్థాన్‌కు చెందిన జాట్ కులస్తుడిని పెళ్లాడారు. కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికీ ఆమోదనీయురాలైన నేతగా ఎదిగారు. మూడుసార్లు అసెంబ్లీకి, ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2003లో రాజస్థాన్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. భైరాన్‌సింగ్ షెకావత్ వంటి దిగ్గజాలకే ఎన్నడూ సాధ్యపడని రీతిలో బీజేపీకి ఏకంగా 120 సీట్లు సాధించిపెట్టారు. రాజస్థాన్‌లో బీజేపీకి మెజారిటీ దక్కడం అదే తొలిసారి. పాలనపై ఆమెకున్న పట్టు తిరుగులేనిదని చెబుతారు. అయితే ఏకపక్ష పోకడలు, ఎవరికీ అందుబాటులో ఉండని నైజంతో 2008లో రాష్ట్రంలో బీజేపీని ఆమే చేజేతులా ఓడించారని విమర్శకులు అంటుంటారు.
 
 ఆమె ఒంటెత్తు పోకడలను గుజ్జర్లు, మీనాల వంటి ప్రాబల్య వర్గాల వారు జీర్ణించుకోలేకపోయారని కూడా చెబుతారు. తన తల్లికి పూర్తి భిన్నంగా ఆరెస్సెస్‌ను, అనుబంధ సంస్థలను దూరంగా ఉంచుతారని రాజెకు పేరుంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో 25 స్థానాలకు గాను బీజేపీ కేవలం 4 మాత్రమే గెలవడంతో రాజె ప్రతిష్ట బాగా మసకబారింది. పార్టీ సూచన మేరకు విపక్ష నేత పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. కానీ రాజె నెమ్మదిగా బలం కూడదీసుకున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆరెస్సెస్ తెరపైకి తెచ్చిన గులాబ్‌చంద్ కటారియాను పక్కన పెట్టేలా పార్టీ పెద్దలను ఒప్పించగలిగారు. నరేంద్ర మోడీతో రాష్ట్రవ్యాప్తంగా విసృ్తతంగా ప్రచారం చేయించడం కూడా రాజెకు బాగా కలిసొచ్చిందన్నది పరిశీలకుల అభిప్రాయం.

మరిన్ని వార్తలు