మోదీకి గేట్స్‌ ఫౌండేషన్‌ అవార్డు

4 Sep, 2019 05:01 IST|Sakshi
రష్యాకు బయల్దేరుతూ ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో..

న్యూయార్క్‌: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ‘గ్లోబల్‌ గోల్‌కీపర్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. పారిశుద్ధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి గుర్తింపుగా మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ఏర్పాటైన ట్రస్ట్‌ బెల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డును అందజేయనుంది. ఈ నెల 24న బ్లూమ్‌బర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరమ్‌ వేదికగా జరగనున్న ఓ కార్యక్రమంలో మోదీ ఈ అవార్డు అందుకోనున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రధాని త్వరలో అమెరికా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించే ప్రయత్నాలు చేపట్టిన రాజకీయ నేతలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవం నాటికి దేశానికి బహిరంగ మలవిసర్జన రహితం చేయాలన్న లక్ష్యంతో మొదలైన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే తొమ్మిది కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశంలో 98 శాతం గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితయ్యాయి. నాలుగేళ్ల క్రితం ఈ సంఖ్య కేవలం 38.  

గాంధీ పార్కు ఆవిష్కరణ? 
గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటైన ‘గాంధీ పీస్‌ గార్డెన్‌’ను మోదీ ప్రారంభించనున్నారు. న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్‌ జనరల్, లాంగ్‌ ఐలాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న శాంతి ఫండ్, న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్శిటీలు కలిసికట్టుగా నాటే 150 మొక్కలు ఈ పార్కులో ఉంటాయి. పార్కులో తమకిష్టమైన వారి జ్ఞాపకార్థం మొక్కలు పెంచుకోవచ్చు. 2014 ఎన్నికల తరువాత మోదీ తొలిసారి ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించగా.. రెండోసారి గెలిచాక మరోసారి ఈ చాన్సు వచ్చింది.

రష్యాతో సంబంధాలను విస్తరిస్తాం
వ్లాడివోస్టోక్‌/న్యూఢిల్లీ: రష్యాలోని వ్లాడివో స్టోక్‌లో జరిగే ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరం (ఈఈఎఫ్‌) సదస్సు సందర్భంగా అధ్యక్షుడు వ్లాడిమిర్‌ పుతిన్‌తో పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానంపై ఈ నెల 4వ తేదీన వ్లాడివోస్టోక్‌ చేరుకోనున్న ప్రధాని ఈఈఎఫ్‌ 5వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అక్కడే జరిగే భారత్‌–రష్యా 20వ వార్షిక భేటీలోనూ పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరిం చడంతోపాటు, బలోపేతం చేసుకోవాలన్న రెండు దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా తన పర్యటన కొనసాగుతుందన్నారు..

సృజనాత్మకత పెంచుకోండి: ఉపాధ్యాయులకు ప్రధాని సూచన
సృజనాత్మకత, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుకుని సాంకేతికతను బోధనలో ఉపయోగించుకోవాలని మోదీ ఉపాధ్యాయులను కోరారు. ఢిల్లీలో తనను కలిసిన జాతీయ అవార్డు గ్రహీతలైన ఉపాధ్యాయులనుదేశించి ప్రధాని మాట్లాడారు. ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వారికి ఆయన వివరించారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా