‘డ్యామ్‌’ ప్రారంభించకుండానే మోదీ వెనక్కి!

16 Mar, 2018 20:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మణిపూర్‌ యూనివర్శిటీలో 105వ ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ను ప్రారంభోత్సవం చేయడానికి శుక్రవారం మణిపూర్‌కు వెళ్లిన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనిలో పనిగా ఆ రాష్ట్రంలో తౌబాల్‌ నదిపై నిర్మించిన మాపిథెల్‌ డ్యామ్‌ను ప్రారంభోత్సవం చేయాల్సి ఉండింది. డ్యామ్‌ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న స్థానికులు అడ్డుకుంటామంటూ ఆందోళన చేయడంతో నరేంద్ర మోదీ చివరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. 20 సామాజిక వర్గాలతో కూడిన ‘సంయుక్త కార్యాచరణ సమితి’ డ్యామ్‌ ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు 48 గంటల ఆందోళనకు 14వ తేదీన పిలుపునిచ్చింది. దీంతో డ్యామ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మార్చి 15వ తేదీన మణిపూర్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని మణిపూర్‌ సీఎం ఎన్‌. బీరేన్‌ సింగ్‌ మీడియా సలహాదారు ఇరెంగ్‌బమ్‌ అరుణ్‌ ధ్రువీకరించడంతో సంయుక్త కార్యాచరణ సమితి ఆందోళనను విరమించింది. 

ఉర్కుల్, సేనాపతి పర్వతాల మధ్య మాపిథెల్‌ లోయ వద్ద డ్యామ్‌ను నిర్మించాలని 1980లో అప్పటి ప్రణాళికా కమిటీ ఆమోదించింది. 1989లో డ్యామ్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. డ్యామ్‌ను నిర్మించినట్లయితే తౌబాల్‌ నది నీటిని వ్యవసాయానికి, తాగునీటికి, విద్యుత్‌ ఉత్పత్తిని వినియోగించవచ్చని ప్రభుత్వం చెప్పింది. 33,400 హెక్టార్లకు సాగునీరు, రోజుకు 4.50 కోట్ల లీటర్ల మంచినీరు అందించడంతోపాటు 7.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి  చేయవచ్చని అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు డ్యామ్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి 2015లో తొలిసారిగా తౌబాల్‌ నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నారు. దాంతో అప్పటి వరకు వేసిన లెక్కలన్నీ తప్పని తేలింది. అనేక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ముంపునకు గురయ్యారు. దిగువన వ్యవసాయం, చేపలపై ఆధారపడి బతుకుతున్న కొన్ని వందల కుటుంబాలు చితికిపోయాయని పర్యావరణ పరిరక్షకవేత్తలు తెలియజేస్తున్నారు. 

ఈ డ్యామ్‌ నిర్మాణానికి 47.25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని 1980లో అధికారులు అంచనా వేయగా, 2016లో సవరించిన అంచనాల ప్రకారం 1500 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అన్నీ అవకతవకలే జరిగాయి. డ్యామ్‌ నిర్మాణం పనులు ప్రారంభించిన 11 ఏళ్లకు అంటే, 2010లో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. బాధితులు మొదటి సారిగా 2013లో డ్యామ్‌ నిర్మాణాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. అదే సంవత్సరం ‘రైట్‌ టు ఫేర్‌ కంపెన్షేషన్‌ అండ్‌ ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ ల్యాండ్‌ అక్విజిషన్, రీహాబిలిటేషన్‌ అండ్‌ రిసెటిల్‌మెంట్‌ యాక్ట్‌–13’ వచ్చింది. ఈ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేస్తూ వస్తోంది. 

మరోపక్క ఆందోళన కారులు డ్యామ్‌ నిర్మాణం పనులు ప్రారంభమైన 11 ఏళ్ల తర్వాత పర్యావరణ అనుమతులు మొదటిసారి వచ్చాయని, రెండోసారి అటవి శాఖ బాధితులను అసలు సంప్రదించకుండానే అనుమతులు మంజూరు చేశారని, అది అటవీ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఆ శాఖ 2013 సంవత్సరంలోనే ఈ అంశాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు అప్పగించింది. 2017, డిసెంబర్‌ నెలలో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బాధితుల పక్షాన తీర్పు చెప్పింది. అటవీ చట్టాలను గౌరవించడంతోపాటు బాధితులతో చర్చలు జరిపి వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది. 

తీర్పు వెలువడి నాలుగు నెలలవుతున్నా బాధిత వర్గాలతో ఎలాంటి చర్చలు చేపట్టకుండానే మణిపూర్‌ ప్రభుత్వం ప్రధాని మోదీతో డ్యామ్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టింది. ఈ రోజు బాధితుల ఆందోళనతో ఆ కార్యక్రమం రద్దయింది. అయితే ఇది బాధితులకు తాత్కాలిక ఉపశమనమేనని, ఆ తర్వాత మరో రోజు డ్యామ్‌ను ప్రభుత్వం ప్రారంభించి తీరుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు