‘మూడు’ ఆశలు గల్లంతు!

17 May, 2014 03:32 IST|Sakshi
‘మూడు’ ఆశలు గల్లంతు!
  • మోడీ గాలికి చతికిలబడిన కూటమిలోని పార్టీలు
  • చావుదెబ్బతిన్న ఎస్పీ, జేడీయూ, డీఎంకే
  • సత్తా చాటుకున్న జయ, నవీన్ పట్నాయక్
  • సాక్షి, న్యూఢిల్లీ: మోడీ సృష్టించిన పెనుగాలికి మూడో కూటమి ఆశలు కొట్టుకుపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో బలీయమైన శక్తిగా ఎదిగి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కూటమిలోని పార్టీల ఆశలు గల్లంతయ్యాయి. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయం అంటూ వామపక్షాలు, ఎస్పీ, జేడీయూ తదితర 11 పార్టీలు కలసి ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలోని సీపీఎం గతంతో పోలిస్తే సగం స్థానాలను కోల్పోయి 9కిపరిమితం కాగా, సీపీఐ ఖాతానే తెరవలేదు.
     ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ధాటికి కమ్యూనిస్టులు చేతులెత్తేశారు.
     
    ఆర్‌ఎస్‌పీ ఒక స్థానంతో సరిపెట్టుకోగా, ఫార్వర్డ్ బ్లాక్, అస్సాం గణపరిషత్, జార్ఖండ్ వికాస్ మోర్చా విజయానికి దూరంగా ఉండిపోయాయి.
     
         
    డీఎంకే 18 సిట్టింగ్ స్థానాల్లో 17 చోట్ల ఓటమితో చావు దెబ్బతిన్నది. ఈ పారీ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకుంది.
         
     మూడో కూటమి ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చిన ములాయం సింగ్ యాదవ్‌కు చెందిన ఎస్పీ కూడా 5 స్థానాల దగ్గరే ఆగిపోయింది. 2009 ఎన్నికల్లో ఈ పార్టీ 23 స్థానాలను దక్కించుకోవడం గమనార్హం. ములాయం, ఆయన కుమారుడు, యూపీ సీఎం అఖిలేశ్ చేసిన విమర్శలు మోడీ మంత్రాంగం ముందు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.
         
     ప్రధాని పీఠంపై కన్నేసిన జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఆశ కూడా అడియాశే అయింది. మోడీతో విభేదించి, బీజేపీతో దీర్ఘకాలిక మిత్ర బంధాన్ని కాలదన్ని ఒంటరి పోరుకు వెళ్లిన జేడీయూ బీహార్‌లో రెండే స్థానాలకు పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో ఈ పార్టీకి 20 ఎంపీ సీట్లు లభించాయి. బీజేపీతో దూరం అయినందుకు జేడీయూ మూల్యాన్ని చెల్లించుకుంది.
         
     కూటమిలోని అన్నాడీఎంకే, బీజేడీ మాత్రమే చక్కటి విజయాలను నమోదు చేశాయి. ప్రధాని పదవిని ఆశించిన జయలలితకు తమిళనాడులో ఓటర్లు ఘన విజయాన్ని అందించారు. 2009 ఎన్నికల్లో మొత్తం 40 సీట్లకు కేవలం 9 సీట్లకే పరిమితమైన జయ... ఈ ఎన్నికల్లో 37 ఎంపీ సీట్లు రాబట్టుకున్నారు.
         
     ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మొత్తం 21 స్థానాలకు గానూ 17 ఎంపీ స్థానాలను రాబట్టుకుంది.
         
     ఇక  మూడో కూటమిలో చేరాలనుకున్న పార్టీల్లో బీఎస్పీ గత ఎన్నికల్లో 21 స్థానాలతో అగ్రస్థానంలో ఉండగా... ఈ సారి మోడీ హవాతో ఒక్క స్థానంలోనూ విజయం దక్కించుకోలేకపోయింది. టీఆర్‌ఎస్ మాత్రమే చెప్పుకోతగినన్ని స్థానాలను గెలుచుకుంది.

>
మరిన్ని వార్తలు