చిన్నారి లేఖ.. స్పందించిన మోదీ

8 Jun, 2016 17:12 IST|Sakshi
చిన్నారి లేఖ.. స్పందించిన మోదీ

పుణె: మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన ఆరేళ్ల బాలిక వైశాలి యాదవ్ గుండెలో రంధ్రం ఉండటంతో అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్తే సర్జరీ చేయడానికి డబ్బు బాగా ఖర్చవుతుందని తెలిపారు. దీంతో తన వ్యాధి, పేదరికాల గురించి ఆమె ఓ లేఖ రాసి, దానికి తన స్కూల్ ఐడీ కార్డును జతచేసి ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) పంపింది. అయిదంటే అయిదు రోజుల్లో స్పందించిన మోదీ.. రూబీ హాల్ క్లినిక్ లో ఆమెకు ఉచితంగా చికిత్స పూర్తిచేయించారు. వైశాలికి ఆపరేషన్ చేయించాలని పీఎంవో నుంచి లేఖ అందుకున్న జిల్లా కలెక్టర్ అందుకు తగిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేశారు.

వైశాలి కుటుంబం బీపీఎల్ స్థాయి కన్నా తక్కువగానే ఉన్నా.. అందుకు తగిన డాక్యుమెంట్లు లేకపోవడంతో ఆమెకు ప్రభుత్వ పథకాల కింద చికిత్స చేయించడం కుదరలేదు. ఈ విషయాన్ని ప్రధానమంత్రికి తెలియజేస్తానని తాను అన్నప్పుడు తన నాన్న ఒప్పుకొన్నారని, నోట్ బుక్ లో నుంచి ఒక పేజి చించి అనారోగ్యం, పేదరికాల విషయాన్ని లేఖలో రాశానని వైశాలి తెలిపింది. కచ్చితమైన అడ్రస్ అంటూ ఏమీ లేకపోవడంతో స్కూల్ ఐడీ కార్డును లేఖకు జతచేసినట్లు వివరించింది. ఐదు రోజుల్లో స్కూల్ నుంచి కొంతమంది తమ ఇంటికి వచ్చారని చెప్పింది. ఆపరేషన్ గురించి పుణెలోని అన్ని ఆసుపత్రులతో చర్చించగా రూబీ హాల్ క్లినిక్ ఆపరేషన్ ను ఉచితంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఈ వారమే ఆపరేషన్ కూడా పూర్తయింది.

బాలికకు ఆపరేషన్ చేయాలని నేరుగా ప్రధానమంత్రి నుంచి లేఖ రావడంతో తాను షాకైనట్లు జిల్లా సర్జన్ డా.సంజయ్ దేశ్ ముఖ్ తెలిపారు. బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకోవడానికి ఎలాంటి సదుపాయం లేకపోవడంతో పాఠశాలలో ఎంక్వైరీ చేసినట్లు చెప్పారు. రూబీ హాల్ క్లినిక్ చైర్మన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నుంచి లేఖ రావడంతో తాము ఆపరేషన్ ను ఉచితంగా చేసినట్లు చెప్పారు. గత ఏడాది దాదాపు వందమందికి పైగా పిల్లలకు సర్జరీలను ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు