‘ఆ రోజు 130 కోట్ల మంది ప్రమాణం చేస్తారు’

31 Mar, 2019 19:25 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ నాలుగు తరాలుగా తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గొప్ప మాటలు చెబుతున్న ఆ పార్టీ నేతలు ఘనమైన వాగ్ధానాలు చేయడమే తప్ప వాటిని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తమను మరోసారి గెలిపిస్తే ప్రజల ఆకాంక్షలను పూర్తిగా నెరవేరుస్తామన్నారు. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో ‘మై భీ చౌకీదార్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ మిషన్‌ శక్తి విజయవంతమైందని, ఇది మన శాస్త్రవేత్తల విజయమని అభివర్ణించారు.

ఈ విజయంతో భారత్‌ మూడు అగ్రదేశాల సరసన చేరిందని చెప్పుకొచ్చారు. పటిష్ట, సుసంపన్న భారత్‌ కోసం కృషి చేసే మనమంతా కాపలాదారులమేనని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తనతో పాటు 130 మంది భారతీయులు ప్రమాణం చేస్తారని చెప్పారు. కాగా, నాలుగు దశాబ్ధాలుగా మనం ఉగ్రవాదంతో బాధపడుతున్నామని, దీనికి బాధ్యులెవరో మనకు తెలుసునన్నారు. 2014 నుంచి ఉగ్రవాదులను జైలుకు పంపేందుకు తాను చర్యలు చేపట్టానన్నారు. దేశాన్ని లూటీ చేసిన వారే పెరిగిన అవినీతికి మూల్యం చెల్లించాల్సి ఉందని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.   

మరిన్ని వార్తలు