ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ చాలెంజ్!

3 Oct, 2014 01:16 IST|Sakshi
ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ చాలెంజ్!

ప్రచారంపై తొమ్మిది మంది ప్రముఖులకు మోదీ ఆహ్వానం
 
న్యూఢిల్లీ: ప్రజలతో భావాలను పంచుకునేందుకు ఇంటర్నెట్‌ను విరివిగా వాడే ప్రధాని మోదీ ‘స్వచ్ఛ భారత్’పై ప్రచారం కోసం వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఇంటర్నెట్‌లో ఇటీవల హల్‌చల్ చేసిన ‘ఐస్ బకెట్ చాలెంజ్’ నుంచి స్ఫూర్తి పొందారో ఏమోగానీ మోదీ ఆ తరహాలో తనదైన సవాల్‌ను విసిరారు. పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటూ పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిదేసి మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు.

తద్వారా ఈ గొలుసుకట్టు ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు మోదీ చెప్పారు. మోదీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తోపాటు ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ టీవీ సీరియల్ బృందం ఉంది.

ఉద్యమానికి అంకితం: అనిల్ అంబానీ
స్వచ్ఛ భారత్ ప్రచార ఉద్యమానికి తాను అంకితం అవుతానని రిలయెన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. దీనిపై ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీ తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తానన్నారు.
 
ప్రచారకర్తగా నియమిస్తే సంతోషం: ఆమిర్‌ఖాన్
ప్రధాని మోదీతో కలిసి ‘స్వచ్ఛ భారత్’ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉద్యమంలో ప్రభుత్వం తనను ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) నియమిస్తే సంతోషిస్తానన్నారు. ఆ బాధ్యతను మనస్ఫూర్తిగా చేపడతానన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు