బాత్‌రూముల్లోకి తొంగిచూస్తారు

12 Feb, 2017 02:08 IST|Sakshi
బాత్‌రూముల్లోకి తొంగిచూస్తారు

మోదీపై విరుచుకుపడ్డ రాహుల్‌
► కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని విడుదల చేసిన అఖిలేశ్‌–రాహుల్‌
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌పై ప్రధాని మోదీ చేసిన ‘రెయిన్ కోట్‌ షవర్‌’ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ధీటుగా స్పందించారు. మోదీకి ఇతరుల బాత్‌రూంలోకి తొంగి చూడడం అంటే ఇష్టమని విమర్శించారు. లక్నోలో శనివారం యూపీ సీఎం అఖిలేశ్‌తో కలసి రెండు పార్టీల కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసే కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడారు. ‘మోదీకి వారఫలాలు (జ్యోతిష్యం), గూగుల్‌లో సెర్చ్‌ చేయటం.. ఖాళీ సమయాల్లో ఇతరుల స్నానపు గదుల్లోకి తొంగిచూడటమే పని’ అని అన్నారు. ‘మోదీకి గూగుల్‌లో వెతకటమే పని. ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం.. మోదీని ఈ పన్నులన్నీ చేసుకోమనండి. ప్రధానిగా నిర్వర్తించాల్సిన పని సక్రమంగా చేస్తే చాలు. ఈ ఎన్నికల ఫలితాలతో ఆయన ఖంగుతింటారు’ అని రాహుల్‌ అన్నారు.

ఇద్దరు యువ నాయకుల మధ్య ఏర్పడిన కూటమి యూపీ భవితను మారుస్తుందని.. ‘ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి’నుద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ ..  ఈ ఎన్నికల్లో తొలి ర్యాలీలో ప్రసంగించారు. తమ్ముడు శివ్‌పాల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జశ్వంత్‌నగర్‌ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తమ్ముడికి ఓటువేయాలని మాత్రమే అభ్యర్థించారు. కనీసం 300 సీట్లలో గెలవాలనే లక్ష్యంతో ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి 10 పాయింట్లతో కనీస ఉమ్మడి కార్యాచరణను శనివారం లక్నోలో విడుదల చేసింది.

అధికారంలోకి వస్తే యువకులకు ఉచిత స్మార్ట్‌ ఫోన్ . 20 లక్షల మంది నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి, రైతులకు రుణాలనుంచి విముక్తి. తక్కువ ధరకే విద్యుత్తు. పంటలకు సరైన ధర, కోటిమంది పేదల కుటుంబాలకు నెలకు రూ.వెయ్యి పింఛను. పట్టణ పేదలకు రూ.10కే భోజనం, ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33 శాతం, పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్  తదితర పది పాయింట్లతో సీఎంపీని వెల్లడించింది.

మరిన్ని వార్తలు