ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

18 Jun, 2017 02:04 IST|Sakshi
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

మౌలిక వసతుల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉంది
► కొచ్చి మెట్రోరైలు ప్రారంభోత్సవంలో ప్రధాని
► భవిష్యత్‌ తరాల సాంకేతికతతో దేశం ముందుకెళ్తోందని ప్రకటన


కొచ్చి: పట్టణాభివృద్ధి ప్రణాళికల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇందుకోసం రవాణా, భూ వినియోగాన్ని సమ్మిళితం చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రధాని తెలిపారు. శనివారం కొచ్చి మెట్రో తొలిదశను జాతికి అంకితం చేసిన అనంతరం అందులో ప్రయాణించారు. ప్రత్యేకమైన వసతులున్న కొచ్చి మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. కొచ్చి మెట్రోరైలు వ్యవస్థలో పనిచేసేందుకు వెయ్యిమంది మహిళలను, 23 మంది ట్రాన్స్‌జెండర్లను నియమించుకోవటం చాలా గొప్ప పరిణామమన్నారు.

‘భవిష్యత్తుతో పోటీపడే మౌలికవసతుల కల్పన ద్వారానే భారత్‌ వృద్ధి సాధిస్తుంది’ అని మోదీ అన్నారు. ‘ప్రగతి సమావేశాల్లో రూ.8 లక్షల కోట్ల విలువైన 175 మౌలికవసతుల ప్రాజెక్టులను నేను వ్యక్తిగతంగా సమీక్షించాను. అన్ని ప్రాజెక్టులూ ప్రతిబంధకాలు దాటాయి. మిలటరీ, డిజిటల్, గ్యాస్‌తోపాటుగా పలు విభాగాల్లో భవిష్యత్‌ తరం మౌలికవసతుల కల్పనపై దృష్టిపెట్టాం’ అని ప్రధాని వెల్లడించారు. అనంతరం ప్రధానితో కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఫలప్రదంగా జరిగిందని.. కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై మోదీ సానుకూలంగా స్పందించారని అనంతరం విజయన్‌ తెలిపారు.

మలయాళంలో మొదలుపెట్టి..
ప్రధాని మోదీ మలయాళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావటం సంతోషంగా ఉందని.. రానున్న రోజుల్లో కొచ్చి మరింత వేగంగా దూసుకుపోనుందని వెల్లడించారు. కొచ్చి మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (కేఎమ్‌ఆర్‌ఎల్‌) ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50–50 శాతం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మితమైంది.

ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.2వేల కోట్లను విడుదల చేసింది. చెన్నైలో రూపొందించిన ఈ కోచ్‌లపై మేకిన్‌ ఇండియా నినాదం కనిపించింది. పలరివట్టం స్టేషన్‌లో మెట్రోను కేరళ సీఎం విజయన్, మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌తోకలిసి ప్రారంభించిన మోదీ.. తర్వాత అదే రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా కేఎమ్‌ఆర్‌ఎల్‌ ఎండీ ఎలియాస్‌తోనూ ప్రధాని మాట్లాడారు. దేశంలో అత్యంతవేగంగా సిద్ధమైన మెట్రో వ్యవస్థగా కేమ్‌ఆర్‌ఎల్‌ ప్రత్యేకత పొందింది. కేరళ గవర్నర్‌ సదాశివం, మంత్రి వెంకయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

బొకే వద్దు బుక్కే ముద్దు
కొచ్చి: పుస్తకాలను చదవటాన్ని మించిన సంతోషం ఎందులోనూ ఉండదని.. విజ్ఞానాన్ని మించిన శక్తివంతమైంది మరొకటి ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొచ్చిలో పీఎన్‌ పానికర్‌ జాతీయ పఠనాదినోత్సవం వేడుకల ప్రారంభంగా మోదీ మాట్లాడుతూ..‘పుష్పగుచ్ఛాల బదులుగా పుస్తకాలను కానుకగా ఇవ్వటం అలవాటుచేసుకోండి’ అని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెంచే ప్రయత్నానికి కేరళే స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. యువత పఠనంపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ‘మనమంతా కలిసి దేశాన్ని మరోసారి విజ్ఞానగనిగా మార్చాలి. ఈ మార్పును తీసుకురాగల శక్తి నేటి యువతలో పుష్కలంగా ఉంది. బొకే బదులుగా పుస్తకం ఇచ్చే అలవాటును ప్రారంభించండి. భారీ మార్పును మీరే గమనిస్తారు’ అని మోదీ తెలిపారు.

మరిన్ని వార్తలు