పాక్‌ గగనతల ఆంక్షలతో మనకు ఇక్కట్లు!

15 Jun, 2019 20:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కిర్గిస్థాన్‌లో జరిగిన ‘షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు పాకిస్తాన్‌ గగనతలం నుంచి కాకుండా ఓమన్‌ గగనతలం మీదుగా వెళ్లిన విషయం తెల్సిందే. భారత వైమానిక దళం గత ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్‌లో బాంబులు కురిపించిన సంఘటనకు ప్రతీకారంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా నిషేధం విధించింది. భారత్‌ చేసిన విజ్ఞప్తిని మన్నించి సుహృద్భావ చర్యగా భారత్‌పై విధించిన గగనతలం ఆంక్షలను 72 గంటలపాటు ఎత్తివేసేందుకు పాకిస్థాన్‌ అంగీకరించింది. అయినప్పటికీ ప్రధాని విమానం పాక్‌ గగనతలం నుంచి కాకుండా ఓమన్‌ గగనతలం మీదుగా వెళ్లింది. ఇందుకు బదులుగా పాకిస్తాన్‌ జూన్‌ 15వ తేదీన ఎత్తివేయాలనుకున్న గగనతల ఆంక్షలను జూన్‌ 28వ తేదీ వరకు పొడిగించింది.

ప్రధాని లాంటి వారు ప్రత్యేక విమానంలో ఎలా తిరిగైనా పోవచ్చని, మిగతా భారతీయ పౌరుల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్‌ గగనతలం ఆంక్షల వల్ల అర గంట నుంచి రెండు గంటల వరకు ప్రయాణ సమయం పెరగడమే కాకుండా చార్జీలు కూడా ఎక్కువ అవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నట్లు ‘ఏర్‌ ప్యాసింజర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ అధ్యక్షులు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లాలంటే అరగంట, యూరప్‌ దేశాలకు వెళ్లాలంటే రెండు గంటలు ఎక్కువ సమయం పడుతోందని ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా గగనతలం ఆంక్షలను పాకిస్తాన్‌ ఎత్తివేసేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.

మరిన్ని వార్తలు