చంద్రబాబు, కేసీఆర్‌లకు ప్రధాని మోదీ ఫోన్‌

19 Jun, 2017 15:29 IST|Sakshi
విపక్ష నేతల మద్దతు కోరిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎంపిక చేసిన విషయాన్ని ఆయన విపక్ష నేతలకు తెలియ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం   ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యనేతలతో పాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన స్వయంగా మాట్లాడారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, తమిళ నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లతో సహా పలువురు నేతలకు మోదీ ఫోన్ చేసి తమ అభ్యర్థి వివరాలను వెల్లడించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తమకు మద్ధతివ్వాలని కోరారు. మరోవైపు ఇతర పార్టీల నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాట్లాడనున్నారు. కాగా  బీహార్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమిత్ షా పార్టీ నిర్ణయాన్ని వెల్లడించారు. అలాగే రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మేదీతో భేటీ కానున్నారు.

మరిన్ని వార్తలు