జయలలితకు ప్రధాని మోదీ ఫోన్

2 Dec, 2015 08:51 IST|Sakshi
జయలలితకు ప్రధాని మోదీ ఫోన్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐడీఎంకే అధినేత్రి జయలలితకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఫోన్లో ప్రధాని ఆరా తీశారు. కేంద్రం తరఫున అవసరమైన సాయాన్ని అందజేసేందుకు సిద్ధమని మోదీ తెలిపారు. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. సుమారు లక్షా 70 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. తమిళనాడులోని 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

అయితే, ఇవే పరిస్థితులు ఒకట్రెండు రోజులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తమిళనాడు తీరానికి ఆనుకొని ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ద్రోణి ప్రాంతంలోనే సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉన్నట్లు సమాచారం. రాగల 24 గంటల్లో తమిళనాడు సహా ఉత్తర కోస్తా, రాయలసీమలోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు