-

చిన్నారి కోసం ప్రసంగానికి విరామమిచ్చిన మోదీ..!

26 Apr, 2019 16:26 IST|Sakshi

వారణాసి : ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్రమోదీ ఓ చిన్నారి విన్నపాన్ని ఆలకించారు. శుక్రవారం నామినేషన్‌ వేయడానికి ముందు రోడ్‌షో నిర్వహించిన మోదీ అభిమానులు, కార్యకర్తల్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా.. చేతిలో ఓ చీటి పట్టుకున్న చిన్నారి ఆయనకు సంజ్ఞ చేసింది. అది గ్రహించిన మోదీ ఆ చిన్నారి చేతిలో ఉన్న చీటిని తీసుకోవాల్సిందిగా స్పెషల్‌ ప్రొటెక‌్షన్‌ కమాండోలకు (ఎస్పీజీ) చెప్పారు. అనంతరం ఆ కాగితాన్ని చదివిన మోదీ చిన్నారికి థాంక్స్‌ చెప్పారు. ‘థాంక్యూ బేటా’ అంటూ ప్రసంగం కొనసాగించారు.

‘స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత అధికార పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అంగీకరించాలి. ప్రజలు తమ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. గత నెలన్నర రోజులగా దేశంలోని అన్ని ప్రదేశాలు తిరిగాను. మోదీ, షా, యోగి అందరూ బీజేపీ కార్యకర్తలే. ఈ ఎన్నికల్లో మా తరపున దేశప్రజలు పోరాడుతున్నారు’ అని చెప్పారు. ఇక వారణాసిలో ఘన విజయం సాధించడం.. పోటీచేసిన అన్ని చోట్ల బీజేపీ జెండా ఎగురవేయడం మన ముందున్న రెండు ప్రధాన అంశాలని అన్నారు. బీజేపీ ప్రతి బూత్‌ కార్యకర్త విజయం సాధించి కాషాయ జెండా మరింత ఎత్తున ఎగిరేలా చేయాలని పిలుపునిచ్చారు. ‘ఈసారి కూడా నేను రికార్డు విజయం సాధించాలని కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. నా విజయమొక్కటే ముఖ్యం కాదు. దేశం ప్రజాస్వామ్య విజయం సాధించాలన్న దానిపైనే నాకు ఎక్కువ ఆసక్తి. తనకు గంగమ్మ దీవెనలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ’ అన్నారు.

మరిన్ని వార్తలు