‘నోట్ల రద్దు గొప్పదనమే’

30 Jan, 2019 20:57 IST|Sakshi

ఇళ్ల ధరలు అందుబాటులోకి రావడంపై ప్రధాని మోదీ

నల్లధనానికి అడ్డుకట్ట వేయగలిగాం

సూరత్‌: చవక ధరకు ఇళ్లు కొనుగోలు చేయాలనే యువత ఆకాంక్ష తమ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దుతో సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పుకొచ్చారు. తన హయాంలో జరిగినన్ని పనులు పూర్వ ప్రభుత్వాలు చేయాలంటే కనీసం 25 ఏళ్లు పడుతుందన్నారు. సూరత్‌ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ‘పెద్ద నోట్లను రద్దు చేస్తే కలిగిన ప్రయోజనమేమిటి అని అనేకమంది అడిగారు. ఈ మాటను మీరు యువత వద్ద అనండి. ఈ నిర్ణయం వల్ల తమకు చవక ధరలకు ఇళ్లు లభిస్తున్నా యని వారు మీకు జవాబిస్తారు. నల్లధనం మొత్తాన్ని రియల్‌ ఎస్టేట్‌ రంగంపైనే పెట్టారు. అయితే నోట్ల రద్దు, రెరా (రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ చట్టం)లను అమల్లోకి తీసుకురావడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలిగాం’ అని అన్నా రు. తమ ప్రభుత్వం ఉడాన్‌ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని, దీంతో సామాన్యులు సైతం విమానయానం చేయగలుగుతున్నారన్నారు.  

1.30 కోట్ల గృహాలు నిర్మించాం 
గడచిన నాలుగు సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం 1.30 కోట్ల గృహాలను నిర్మించిందని మోదీ చెప్పారు. అయితే యూపీఏ హయాంలో కట్టింది కేవలం 25 లక్షల ఇళ్లేనని ఆయన తెలిపారు. గడచిన మూడు దశాబ్దాల కాలంల్లో హంగ్‌ పార్లమెంట్‌ను కూడా దేశం చవిచూసిందని, దీని వల్ల అభివృద్ధికి విఘాతం కలిగిందని చెప్పారు. అయితే తమ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇవ్వడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందన్నారు.  

>
మరిన్ని వార్తలు