సోషల్ మీడియా సూపర్‌స్టార్

26 May, 2016 09:21 IST|Sakshi
సోషల్ మీడియా సూపర్‌స్టార్

 ప్రసార - ప్రచార మాధ్యమాలు (చానళ్లు - పేపర్లు) రాజకీయ నాయకుల ప్రచారాలకు బాగానే ఉపయోగపడుతున్నా అలాంటి ప్రచారంతో పాటు ఆయా నాయకుల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేందుకు సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) అద్భుతమైన సాధనం. అందులోనూ ట్విట్టర్ వంటివి నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నికల ముందు గానీ, తర్వాత గానీ సోషల్ మీడియాను ఆయన ఉపయోగించుకున్నంతగా మరెవరూ ఉపయోగించుకోలేదనడం అతిశయోక్తి కాదు.   

సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించబట్టే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు ప్రకటించాలన్నా ఆయన దాన్నే సాధనంగా చేసుకుంటున్నారు. తద్వారా వాటికి విస్తృతమైన ప్రచారం కల్పిస్తున్నారు. స్వీయ ప్రచారానికి, విధానపరమైన నిర్ణయాల ప్రచారానికి మాత్రమే కాదు... దేశాలతో దౌత్య సంబంధాలకు కూడా ఆయన ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా సాధనాల సేవలను ఉపయోగించుకుంటున్నారు. అందుకే ఆయన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా పాపులర్ అయ్యారు. ఈ ఏడాది కూడా టైమ్ మ్యాగజీన్ ‘30 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులు’ జాబితాలో మోదీకి స్థానం లభించింది. ట్విట్టర్‌లో ఆయనను 2.2 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ఫేస్‌బుక్‌లో 3.4 కోట్ల మంది మోదీని లైక్ చేశారు. ఇంటర్నెట్, చానళ్ల విస్తృత వినియోగంతో మరుగున పడిపోతున్న ఆకాశవాణి (రేడియో)కు కూడా సోషల్‌మీడియాలో చోటు కల్పించిన ఘనత మోదీదే.

రేడియోలో ‘మన్ కీ బాత్’ పేరుతో మోదీ ప్రసంగాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. కీలకమైన విధాననిర్ణయాలను ప్రకటించడానికి ‘మన్ కీ బాత్’ను ఉపయోగిస్తుండడంతో అందరూ దానిపై కేంద్రీకరించాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాలో ఖాతాలను తానే స్వయం గా నిర్వహిస్తున్నారా అన్నట్లుగా ఉంటాయి మోది పోస్టింగ్‌లు, మెస్సేజ్‌లు. ‘ఈ ఫొటో నేనే తీశాను...’ ‘ఈ సంఘటన నన్నెంతగానో కదిలించింది..’ అంటూ ఆయన స్వయంగా చేస్తున్న ట్వీట్ల వల్లే నెటిజన్లు ఆయనకు బాగా చేరువవుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. 

అయితే మోదీ సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నంతగా  బీజేపీ ఉపయోగించుకోలేకపోతోంది. ముఖ్యంగా ఆ పార్టీకున్న 282 మంది ఎంపీలలో మెజారిటీ భాగం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని కార్యాలయం ఇటీవలే ఈ గణాంకాలన్నీ తీసింది. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మోదీ వెంటనే ఎంపీలందరికీ ఓ లేఖరాశారు. ఒక్కో ఎంపీ కనీసం లక్ష మంది ఫాలోవర్లు, లక్ష లైక్‌లు సంపాదించేలా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో యాక్టివ్ కావాలని ఆయన ఆ లేఖలో కోరారు.  

తీరు మార్చిన  నిర్ణయాలు
 
*ఈ ఎన్డీయే కేబినెట్లో గత యూపీఏ ప్రభుత్వంలో కన్నా 35% తక్కువగా మంత్రివర్గ సభ్యులున్నారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన దిశగా మంత్రివర్గ కూర్పులో కీలక మార్పులు చేపట్టారు. తద్వారా ఆమేరకు ఖజానాపై భారం తగ్గించారు.
*జనాభాలో 65%  ఉన్న యువత శ్రమ శక్తిని ఉపయోగించుకోవడానికి.. నైపుణ్యాభివృద్ధి పెంపు కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు.
*పాక్‌తో సత్సంబంధాలను కోరుకుంటునే..  ఉగ్రవాదంపై పాక్ రెండు నాల్కల ధోరణిని ప్రతీ సందర్భంలో ఎత్తి చూపుతూనే ఉన్నారు.
*ప్రణాళిక సంఘం ప్రస్తుత అవసరాలకు సరిపోదని భావించి, ‘నీతి ఆయోగ్’ను తెరపైకి తెచ్చారు.
*యూపీఏ అవినీతి కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలకు.. అవినీతి రహిత పాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చారు. రెండేళ్ల పాలనలో  నీతిమంత పాలన అందించేందుకు కృషి చేశారు.  
 
 మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రులు
 1.    సుష్మాస్వరాజ్ (విదేశాంగ శాఖ)
 2.    రాజ్‌నాథ్ సింగ్ (హోం శాఖ)
 3.    అరుణ్ జైట్లీ (ఆర్థిక శాఖ)
 4.    వెంకయ్యనాయుడు (పట్టణాభివృద్ధి శాఖ)
 5.    మనోహర్ పరీకర్ (రక్షణ శాఖ)
 6.    సురేశ్ ప్రభు (రైల్వే శాఖ)
 7.        నితిన్ గడ్కరీ (రోడ్డురవాణా, నౌకాయాన శాఖ)
 
 వ్యవసాయం  గుడ్డిలో  మెల్ల
మన దేశం ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ వ్యవసాయ రంగం. స్థూల దేశీయోత్పత్తికి 14 శాతం అందిస్తున్న ప్రాధాన్య రంగం ఇది. దేశ జనాభాలో 55 శాతం మంది (సుమారు 60 కోట్ల మంది) వ్యవసాయం, అనుబంధ వ్యాపకాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అన్నదాతా సుఖీభవా అన్న భావన అనాదిగా ఉన్నప్పటికీ ఆరుగాలం చమటోర్చి పంటలు పండిస్తూ సమాజానికి అన్నం పెడుతున్న రైతుకు మాత్రం సేద్యం గిట్టుబాటు కావడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం అంతకంతకూ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ పాలన గుడ్డిలో మెల్ల అని చెప్పాలి.

వ్యవసాయ రంగ సంక్షోభం పరిష్కారానికి ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు చేస్తామని రెండేళ్ల క్రితం బీజేపీ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది.   అయితే, అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని తుంగలో తొక్కింది. అయితే, వ్యవసాయ సంక్షోభాన్ని ఉపశమింపజేసే దిశగా గత రెండేళ్లుగా ఆచితూచి అడుగులు వేస్తున్నది. స్వామినాథన్ సిఫారసు చేసిన విధంగా ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించడం కాదు గానీ.. 2022 నాటికి రైతులకు ఆదాయ భద్రత కల్పిస్తామని నమ్మబలుకుతోంది.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్లలో ఈ- వేలం సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నది. ఈ చర్య వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి దోహదపడుతుందని మోదీ చెబుతున్నారు. అయితే, ఈ-వేలం సదుపాయాన్ని ఉపయోగించుకునేలా రైతులకు సాంకేతిక సహాయం అందించాల్సి ఉంది.  అకాల వర్షాలు, కరువు కాటకాల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వం మెరుగైన పంటల బీమా పథకాన్ని (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) ప్రవేశపెట్టింది.

తక్కువ ప్రీమియం, ఎక్కువ మంది రైతులకు బీమా సదుపాయం కల్పించడం, కోత అనంతర నష్టాలకూ బీమాను వర్తింపజేయడం, అన్నిటికీ మించి.. మండలాన్ని, గ్రామాన్ని కాకుండా రైతు పొలాన్ని యూనిట్‌గా పరిగణించి నష్టాన్ని అంచనావేసే వెసులుబాటు కల్పించారు. సాగు నీటి వనరుల అభివృద్ధికి ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన ద్వారా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి.. బిందు, తుంపర సేద్యానికి మరింత ప్రోత్సాహాన్నిస్తున్నారు. నీమ్ కోటెడ్ యూరియాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నది. వాతావరణం, వ్యవసాయ, మార్కెట్ సమాచారాన్ని  అందించేందుకు కిసాన్ ఛానల్‌ను ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు