వారణాసి బరిలో మోడీ

16 Mar, 2014 02:13 IST|Sakshi
వారణాసి బరిలో మోడీ

లక్నో నుంచి రాజ్‌నాథ్
కాన్పూర్‌కు ఎం.ఎం. జోషీ మార్పు
సిద్ధూ సీటు జైట్లీకి కేటాయింపు
55 మందితో బీజేపీ నాలుగో జాబితా

 
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 80 లోక్‌సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంలో దోహదపడేందుకు పార్టీ ప్రచార రథసారథి, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని యూపీ నుంచే ఎన్నికల బరిలోకి దింపింది. బీజేపీ కంచుకోటల్లో ఒకటైన వారణాసి స్థానాన్ని ఆయనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు లక్నో సీటును కేటాయించింది.
 
రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ తదితర 12 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం రాత్రి 11.05 గంటలకు 55 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను విడుదల చేసింది. వారణాసి, లక్నో సీట్ల కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ మోడీ, రాజ్‌నాథ్‌ల పేర్లు ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ మీడియాకు ఈ జాబితాను విడుదల చేశారు.
 
 ప్రస్తుతం వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీకి కాన్పూర్ స్థానాన్ని కేటాయించింది. ఘజియాబాద్ నుంచి ఎంపీగా ఉన్న రాజ్‌నాథ్‌కు లక్నో సీటు ఇచ్చింది. తొలుత లక్నో స్థానాన్ని వదులుకోడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సిట్టింగ్ ఎంపీ లాల్జీ టాండన్ పార్టీ అగ్రనేతలు, ఆర్‌ఎస్‌ఎస్ జోక్యంతో సద్దుమణిగారు. ఇక అమృత్‌సర్ లోక్‌సభ స్థానంపై వివాదం కొనసాగింది.
 
 అమృత్‌సర్ స్థానాన్ని తనకు కేటాయించకుంటే మరేస్థానంలోనూ పోటీచేయబోనని సిట్టింగ్ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. కానీ అరుణ్ జైట్లీకి ఆ స్థానాన్ని కేటాయిస్తే తనకు అభ్యంతరం లేదన్నారు. చివరకు అరుణ్‌జైట్లీకి అమృత్‌సర్ స్థానం దక్కింది. ఫిలిబిత్ నుంచి మేనకా గాంధీ, సుల్తాన్‌పుర్ నుంచి వరుణ్ గాంధీ, ఝాన్సీ నుంచి ఉమాభారతి పోటీ చేయనున్నారు. బీహార్‌లోని పాట్నా సాహిబ్ నుంచి బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా పోటీ చేయనున్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సంబంధించి.. హర్షవర్ధన్ (చాందనీచౌక్), మనోజ్ తివారీ (ఈశాన్య ఢిల్లీ), మహేష్ గిరి (తూర్పు ఢిల్లీ), మినాక్షి లేఖీ (న్యూఢిల్లీ), ఉదిత్‌రాజ్ (నార్త్‌వెస్ట్ ఢిల్లీ), పర్వేశ్ వర్మ (పశ్చిమ ఢిల్లీ), రమేష్ బిధూరి (దక్షిణ ఢిల్లీ) బరిలోకి దిగనున్నారు.  కాగా, వివిధ పార్టీలతో పొత్తుల అంశంపై జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తుకు ముందుకు వెళ్లడానికి బోర్డు సుముఖత తెలిపినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తమిళనాడులో నటుడు విజయ్‌కాంత్ స్థాపించిన డీఎండీకేతో బీజేపీ శనివారం పొత్తు కుదుర్చుకుంది.
 
 సుష్మ-జైట్లీ మధ్య వాగ్వాదం!
 ఎన్నికల కమిటీ సమావేశంలో సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. యడ్యూరప్పకు సీటు ఇవ్వడం, బీఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత శ్రీరాములను పార్టీలోకి తీసుకోవడాన్ని సుష్మ తప్పుపట్టారు. తాను వ్యతిరేకించినప్పటికీ వీరిరువురికి పార్టీ టికెట్లు ఇవ్వడంపై సుష్మ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అయితే రాజకీయ నాయకుల ఇష్టాయిష్టాలపై అభ్యర్ధుల ఎంపిక జరగదని జైట్లీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు