అమెరికాలో మన ప్రధాని ఏం తింటారు?

23 Sep, 2014 10:06 IST|Sakshi
అమెరికాలో మన ప్రధాని ఏం తింటారు?

భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వస్తున్నారని.. అక్కడి వాళ్లు ఆయనకు భారీగా వండి వడ్డించాలనుకోవడం సహజం. అందులోనూ అక్కడున్న ఎన్నారైలయితే మోడీ కోసం రకరకాల గుజరాతీ వంటలు చేయించాలని భావిస్తారు. ఇక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఎటూ విందులు ఉండనే ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా.. అమెరికా పర్యటనలో మోడీ ఏం పుచ్చుకుంటారో తెలుసా.. కేవలం టీ, నిమ్మరసం మాత్రమే. నిమ్మరసంలో ఓ రెండు తేనె చుక్కలు వేసుకుంటారట. ఆ పర్యటనలోనే కాదు.. దసరా శరన్నవరాత్రులు తొమ్మిది రోజులూ నరేంద్ర మోడీ ప్రతి యేటా ఇలాగే చేస్తుంటారు. అనుకోకుండా ఆయన అమెరికా పర్యటన నవరాత్రుల సమయంలోనే వచ్చింది. దాంతో ఉపవాసానికి సంబంధించిన నియమ నిబంధనలు కచ్చితంగా పాటించే మోడీ.. అక్కడ కూడా కేవలం టీ, నిమ్మరసంతోనే సరిపెట్టుకుంటారు.

మోడీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ డిన్నర్ ఏర్పాటు చేశారు. అలాగే అమెరికన్ సీఈవోలు సెప్టెంబర్ 29న బ్రేక్ఫాస్ట్ ఏర్పాటుచేశారు. వీటన్నింటికీ మోడీ తప్పకుండా హాజరవుతారని, అయితే ప్రతిచోటా ఆయన మాత్రం కేవలం టీ, నిమ్మరసం మాత్రమే తీసుకుంటారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.

గత నాలుగు దశాబ్దాలుగా నరేంద్రమోడీ శరన్నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి, ధ్యానం, ప్రార్థనలు చేసుకుంటారని, నిమ్మరసం కూడా తానే వెంట తీసుకెళ్తారని మోడీతో గత 12 ఏళ్లుగా అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న ఓ అధికారి చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు ఆయన సాధారణంగా ఈ తొమ్మిది రోజుల్లో రాష్ట్రం దాటి బయటకు వెళ్లేవారు కారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు నవరాత్రులు ఉన్నాయి. 25వ తేదీ సాయంత్రమే మోడీ అమెరికా బయల్దేరి వెళ్లి, తిరిగి అక్టోబర్ 1న భారతదేశానికి వస్తారు.

డాక్టర్లు ఆయనను పళ్లు ఎక్కువగా తీసుకోవాలని, అలాగే పళ్లరసాలు కూడా తాగాలని చెప్పినా.. నవరాత్రుల్లో అవేవీ తీసుకునేది లేదని మోడీ తిరస్కరించారని గుజరాత్లో మోడీకి సన్నిహితుడైన ఓ సీనియర్ మంత్రి చెప్పారు. చాలామంది నవరాత్రుల్లో ఉపవాసం చేసినా, సూర్యాస్తమయం తర్వాత మళ్లీ దీపారాధన చేసి అప్పుడు ఆహారం తీసుకుంటారు. మోడీ మాత్రం ఆ తొమ్మిది రోజులు అసలేమీ తినరు.

మరిన్ని వార్తలు