పాక్ ప్రధానిని కలవనున్న మోదీ

6 Jul, 2015 08:43 IST|Sakshi
పాక్ ప్రధానిని కలవనున్న మోదీ

న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి జకీ-ఉర్ రహమాన్ విడుదలైన తర్వాత భారత్- పాక్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో ఏర్పడిన స్తబ్దత కొంతమేర సడలిపోనుంది. తన ఏడురోజుల మధ్య ఆసియా, రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలుసుకోనుండటం అందుకు ఊతమిచ్చేదిగా ఉంది.

రష్యాలోని ఉఫా పట్టణంలో షాంఘై కో- ఆపరేషన్ ఆర్గనైజేషన్ జులై 10న ఓ సదస్సు నిర్వహిస్తోంది. దీనికి మోదీ, షరీఫ్‌లు హాజరుకానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలకు ఎలాంటి తావుండదని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. చివరిసారిగా గతేడాది నవంబర్‌లో కాఠ్మాండు వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంలో ప్రధాని మోదీ.. షరీఫ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే రంజాన్ మాసంలోనే ఈ ఇరువురూ భేటీ అవుతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నేటి (సోమవారం) నుంచి 13 వరకు ఉబ్జెకిస్థాన్, ఖజకిస్థాన్, రష్యా, తుర్క్మెనిస్థాన్, కర్గీజ్స్థాన్, తజకిస్థాన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. ఒకే సారి మధ్య ఆసియా దేశాల్లో పర్యటిస్తున్న తొలి భారతీయ ప్రధాని మోదీయే కావడం విశేషం.

మరిన్ని వార్తలు