ప్రోగ్రెస్ రిపోర్టును బట్టే మంత్రి పదవులు!

30 Jun, 2016 11:35 IST|Sakshi
ప్రోగ్రెస్ రిపోర్టును బట్టే మంత్రి పదవులు!

మంత్రివర్గాన్ని యథాతథంగా ఉంచాలా.. కొందరిని తీసేసి మరికొందరికి అవకాశం ఇవ్వాలా.. పదోన్నతులు ఏమైనా అవసరమా అనే అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశీలిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తామేం చేశామన్న విషయాన్ని మంత్రులంతా ఎవరికి వారు ప్రజంటేషన్ల రూపంలో ప్రధానికి వివరించాల్సి ఉంటుంది. ఎవరికి వారు ఇచ్చుకునే ఈ ప్రోగ్రెస్ కార్డుల ఆధారంగానే మంత్రుల తలరాతలు నిర్ణయం అవుతాయి. ఇందుకోసం గురువారం మధ్యాహ్నం మోదీ తన మంత్రులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మార్పు చేర్పుల విషయమై ఇప్పటికే బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోదీ దాదాపు 5 గంటల పాటు భేటీ అయ్యారు.

కొంతమంది మంత్రుల శాఖలు మారుస్తారని, కొత్తగా కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. జూలై 6వ తేదీన ప్రధానమంత్రి ఆఫ్రికా పర్యటనకు వెళ్తున్నందున ఆలోపే మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయంటున్నారు. జూలై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో ఈలోపే కొత్త సర్కారు రూపొందుతుంది. ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్లకు కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇక న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు పెద్దగా మార్కులు పడే అవకాశం లేదు. దాంతో ఆయనకు సహాయంగా ఉండేందుకు ఓ బలమైన మంత్రిని కేటాయించొచ్చని చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని సహా మొత్తం 83 మందికి మించకూడదు. ప్రస్తుతం 66 మంది ఉన్నారు. వారిలో 12 మంది యూపీకి చెందినవారే. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం అలాగే కొనసాగించే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు