కరోనాపై భయాందోళలు తొలగించాలి : మోదీ

23 Mar, 2020 22:11 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) గురించి ప్రసార మాధ్యమాలు ప్రజలకు వాస్తవ సమచారం అందజేసి వారిలో భయాందోళనలు తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వైరస్‌ ఒక జీవితకాలపు సవాలు అని తెలిపారు. దానిని అధిగమించడానికి వినూత్న ఆవిష్కరణతో కూడిన పరిష్కారాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశలో రిపోర్టర్లు, కెమెరామెన్లు, సాంకేతిక నిపుణులు నిర్విరామ కృషిని జాతికి గొప్ప సేవగా పరిగణించాలని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోమవారం ప్రముఖ ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇష్టాగోష్ఠి నిర్వహించారు. 

కరోనా మహమ్మారి ముప్పు తీవ్రతను అర్థం చేసుకుని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా కృషి చేస్తున్న అన్ని మాధ్యమాలకూ ముందుగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రిపోర్టర్లు, కెమెరామెన్లు, సాంకేతిక నిపుణులు అటు క్షేత్రస్థాయిలో, ఇటు స్టూడియోల్లో నిర్విరామంగా శ్రమిస్తున్నారంటూ ప్రశంసించారు. అంకితభావం, చిత్తశుద్ధితో కూడిన వారి విధి నిర్వహణను జాతికి చేస్తున్న గొప్ప సేవగా ఆయన కొనియాడారు. అదే సమయంలో కొందరు సిబ్బంది ఇళ్ల నుంచే పని చేసేలా కొన్ని చానెళ్లు వినూత్న ప్రయత్నం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.

సుదీర్ఘంగా పోరాడాల్సి ఉంది..
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19ను ఒక జీవితకాలపు సవాలుగా ప్రధానమంత్రి అభివర్ణించారు. దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త, ఆవిష్కరణాత్మక పరిష్కారాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. మన పోరాటం ఇక ముందు కూడా సుదీర్ఘంగా కొనసాగాల్సి ఉందని చెప్పారు. ఇందులో భాగంగా సామాజిక దూరం పాటించడంపై అవగాహన పెంచాలన్నారు. అలాగే తాజా పరిణామాలపై సమాచారాన్ని, కీలక నిర్ణయాలను వేగంగా ప్రజలకు చేరవేయాల్సి ఉందన్నారు. అదే సమయంలో ఇదంతా సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో ప్రజానీకానికి అందించడంలో వృత్తి నైపుణ్యానికి పదును పెట్టాలని సూచించారు. ప్రసార మాధ్యమాలు ఒకవైపు- ప్రజలు స్వీయ రక్షణను విస్మరించి, నిర్లక్ష్యానికి తావివ్వకుండా చూడటమేగాక మరోవైపు- వాస్తవ సమాచారమిస్తూ వారిలో నిరాశావాదాన్ని, భయాందోళనలను పారదోలేందుకు కృషి చేయాలని సూచించారు. 

రిపోర్టర్లకు ప్రత్యేక మైకులు అందజేయాలి..
కరోనా మహమ్మారిపై పోరాటంలో ఎంతో సాహసంతో ముందునిలిచి, నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిత్యనూతన ఉత్తేజం నింపాల్సిన బాధ్యత కూడా ప్రసార మాధ్యమాలపై ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, ప్రసారంలో వార్తా చానెళ్లు కీలక సాధనంగా ఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే రిపోర్టర్లకు పొడవాటి గొట్టం చివరన అమర్చిన ప్రత్యేక మైకులను అందించాలని చానెళ్ల యాజమాన్యాలకు ఆయన సూచించారు. ఆ మేరకు వారు ఇంటర్వ్యూల వంటివి నిర్వహించే సమయంలో ఒక మీటరు సామాజిక దూరం పాటించగలిగేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమాచారం ఇచ్చేటప్పుడు శాస్త్రీయ నివేదికలకు ప్రాచుర్యం లభించేలా చూడాలన్నారు. అవాస్తవాల వ్యాప్తి అడ్డుకోవడం కోసం బృంద చర్చలలో నిష్ణాతులైన ప్రముఖులను భాగస్వాములను చేయాలని నిర్దేశించారు. అలాగే వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో సామాజిక దూరం పాటించడంలో పౌరులు కూడా క్రమశిక్షణతో మెలగటం ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి చెప్పారు. 

కరోనా వైరస్‌ సవాలును ఎదుర్కొవడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ప్రధానమంత్రి నాయకత్వ పటిమకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రధానితో చేయికలిపి ముందడుగు వేస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రధానమంత్రికి ప్రజలతో భావోద్వేగపూరిత అనుబంధం ఉందని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. అందువల్ల తరచూ ప్రజలనుద్దేశించి ప్రసంగించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కోవిడ్‌-19పై సానుకూల కథనాలను... ప్రత్యేకించి ఆ మహమ్మారి నుంచి విముక్తులైనవారి అనుభవాలను తన ప్రసంగాల్లో ప్రస్తావించాలని కోరారు. అలాగే లేనిపోని వదంతుల నివారణకు, వాస్తవాల నివేదనలో రిపోర్టర్లకు మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన డాక్టర్లతో 24గంటలూ పనిచేసే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రభుత్వ మాధ్యమం ప్రసారభారతి ద్వారా రోజుకు రెండుసార్లు ప్రజలకు అధికారిక సమాచారం అందించాలని, దీన్ని ఇతర టీవీ చానెళ్లు కూడా వినియోగించుకనే వీలుందని సూచించారు.

ఎంతో విలువైన సూచనలు-సలహాలు, సమాచారం ఇచ్చినందుకుగాను ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ప్రతినిధులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరెన్సీ నోట్లద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందున డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చానళ్ల ప్రతినిధులకు ఆయన సూచించారు. దీంతో పాటు ప్రజలకు శాస్త్రీయ సమాచార నివేదన ద్వారా మూఢనమ్మకాల వ్యాప్తిని నిరోధించాలని కోరారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం సేకరించే విలేకరులు ఆ విషయాలను ఎప్పటికప్పుడు చురుగ్గా తమతో పంచుకోవడంపై ఆ శాఖ కార్యదర్శి ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం రూపొందించిన ప్రభుత్వ శ్రేణి ప్రభుత్వ వ్యవస్థ సంబంధిత వివరాలను ఆమె వివరించారు. దీంతో పాటు సవాళ్లను ఎదుర్కొవడంలో సామర్థ్య నిర్మాణం దిశగా నిరంతరం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. వైరస్‌ బాధితులకు పరీక్షల సంబంధిత వ్యూహంలోనూ ఇదే విధమైన ప్రతిస్పందన విధానాన్ని అనుసరిస్తున్నామని, పరీక్ష ఉపకరణాలకు ఆమోద ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నామని భారత వైద్యపరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌ చెప్పారు. కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రితోపాటు ఆ శాఖ కార్యదర్శిసహా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ మాధ్యమ సంస్థల సంపాదకులు, ఇతర సీనియర్‌ ప్రతినిధులు ఈ ఇష్టాగోష్ఠి సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు