ఈ పొరపాటేమిటి నరేంద్ర మోదీజీ?

24 Dec, 2015 13:18 IST|Sakshi
ఈ పొరపాటేమిటి నరేంద్ర మోదీజీ?

మాస్కో: రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అక్కడ స్వాగత కార్యక్రమంలో తనకు తెలియకుండానే ఓ పొరపాటు చేశారు. రష్యా బ్యాండ్ భారత జాతీయ గీతమైన ‘జన గణ మన అధినాయక జయహే’ను ఆలపిస్తుండగా రెడ్ కార్పెట్‌పై ముందుకు నడిచారు.  ఈ విషయాన్ని గ్రహించిన ఓ అధికారి  వెంటనే మోదీ ముందుకువెళ్లి ఆయన్ని అంతకుముందున్న చోటుకు తీసుకెళ్లి నిలబెట్టారు. గీతాలాపన అనంతరం మోది మళ్లీ ముందుకు కదిలారు.

మోదీని ఆహ్వానించేందుకు వచ్చిన రష్యా ప్రభుత్వ ప్రతినిధి, మోదీ రాగానే భారత జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా రష్యా అధికార బ్యాండ్‌ను ఉద్దేశించి చేయి ముందుకు సాచారు. ఆ సైగను పొరపాటుగా అర్థం చేసుకున్న మోదీ, తనను ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నారని భావించి భారత జాతీయ గీతాలాపన కొనసాగుతుండగానే ముందుకు నడిచారు. ఈ సంఘటనను ఎవరు ఎలా అర్థం చేసుకున్నప్పటికీ పార్టీకన్నా దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ముద్రపడిన మోదీ ఇలా చేయడమేమిటని ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 ‘జన గణ మన అధినాయక  జయహే....జాతీయ గీతాన్ని దేశానికి ఆపాదించిందీ కాంగ్రెస్ పార్టీ, అలాంటప్పుడు బీజేపీ పార్టీకి చెందిన మోదీ దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు....మొన్న జాతీయ జెండాను అవమానించారు. నేడు జాతీయ గీతాన్ని అవమానించారు. విదేశీ పర్యటనల్లో ఎప్పుడూ కెమేరాలపైనే కాకుండా ఇలాంటి విషయాలపై కూడా దృష్టి పెట్టండీ మోదీ గారు....మోదీ పచార్లు చేస్తున్నప్పుడు జాతీయ గీతాలాపన ఆపవద్దా?....మోదీనే జాతీయ గీతం అవమానించిందీ, ఆయన నడిచేందుకు పాస్ ఇవ్వాలిగదా!.....ముంబై సినిమా థియేటర్‌లో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడనందుకు ఓ జంటను బయటకు తరిమేసిన దేశభక్తులారా! ఇప్పుడేమంటారు?...’ లాంటి విమర్శలు ట్విట్టర్‌లో చెక్కర్లు కొడుతున్నాయి.

 విదేశీ పర్యటనల సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఇలాంటి పొరపొట్లు చేయకపోలేదు. మోదీకి కూడా ఇది కొత్తేమి కాదు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చేందుకు భారత జాతీయ జెండాపై ఆయన తన సంతకం చేశారు. సంతకం చేయడం కూడా జాతీయ జెండాను అవమానపర్చడమే. అంతెందుకు గత నెలలో మోదీ, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేను కలసుకున్నప్పుడు వారి వెనకాల భారత జాతీయ జెండా తలకిందులుగా అమర్చి ఉంది. అప్పుడు కూడా విమర్శలు రాగా అది ప్రొటోకాల్ ఆఫీసర్ తప్పిదమని, చర్యలు తీసుకుంటామని పీఎంవో వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు