మరోసారి సీఎంలతో మాట్లాడనున్న మోదీ

8 Apr, 2020 18:09 IST|Sakshi

ఏప్రిల్‌ 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఏప్రిల్‌ 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించడంతోపాటు.. రాష్ట్రాలవారీగా తీసుకున్న చర్యలపై మోదీ సమీక్ష జరపనున్నట్టుగా సమాచారం. అలాగే లాక్‌డౌన్‌ పొడిగింపుకు సంబంధించి మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది.

కరోనా నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రధాని మోదీ ఇప్పటికే రెండుసార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాగే దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో కూడా మోదీ ఈ అంశంపై చర్చించారు. కాగా, నేడు పలు పార్టీల పార్లమెంట్‌ ఫ్లోర్‌ లీడర్లతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపుకు సంబంధించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయలేమని.. ఈ విషయంపై సలహాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ పొడగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి : ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: మోదీ

మరిన్ని వార్తలు