హాట్ టాపిక్‌గా మారిన మోదీ విషెస్!

19 Mar, 2018 16:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌: చైనా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన జీ జిన్‌పింగ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జిన్‌పింగ్‌ విధేయుడు, సన్నిహితుడు వాంగ్‌ క్విషాన్‌ (69) చైనా ఉపాధ్యక్షుడయ్యారు. పొరుగుదేశం చైనాతో ఇప్పటికే సరిహద్దు డోక్లామ్‌తో పాటు మరిన్ని ప్రాంతాల్లో భారత్‌ సమస్యలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ అభినందించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రెండోసారి అధ్యక్షుడైన అనంతరం జిన్‌పింగ్ మాట్లాడుతూ.. భారత్-చైనా సంబంధాలు మెరుగయ్యేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో చైనా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ వీబోలో సోమవారం జిన్‌పింగ్‌కు అభినందనలు తెలిపినట్లు సమాచారం. కాగా, ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తివేస్తూ ఇటీవల చైనా పార్లమెంటు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఇటీవల బీజింగ్‌లో పర్యటించి చైనా ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. వచ్చే నెలలో రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చైనా పర్యటించనున్నారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించే షాంగై సహకార సమాఖ్య సమావేశంలో భాగంగా చైనాలోని కింగ్డౌనగరంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు భేటీ కానున్నారు.

>
మరిన్ని వార్తలు