తాత అయ్యారుగా.. కంగ్రాట్స్!

30 Sep, 2014 01:43 IST|Sakshi
తాత అయ్యారుగా.. కంగ్రాట్స్!

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకునేందుకు న్యూయార్క్ పాలెస్ హోటల్‌కు వచ్చారు. వారికి మోదీ, భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ సాదరంగా స్వాగతం పలికారు. సుష్మా, హిల్లరీలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అమ్మమ్మ, తాతయ్యలైనందుకు క్లింటన్ జంటను మోదీ, సుష్మాలు అభినందించారు. అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు వారు సమావేశమై, భారత్, యూఎస్ సంబంధాలపై చర్చించారు. ‘ఆర్థికరంగ అభివృద్ధికి సంబంధించి మీ కున్న పరిజ్ఞానం ముందు ఎవరైనా దిగదుడుపే’ అని మోదీని బిల్ క్లింటన్ ప్రశంసించారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. అలాగే, గంగానది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడాన్ని కూడా క్లింటన్ ప్రశంసించారని తెలిపారు.

‘అది పవిత్రమైన కార్యక్రమం. మీ ఈ చర్య ఆసియాలోని ఇతర దేశాలకు ఒక స్ఫూర్తినిస్తుంది’ అని క్లింటన్ అన్నారని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. బిల్, హిల్లరీల కూతురు చెల్సియా గతవారం పాప చార్లట్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 2016 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి హిల్లరీ క్లింటన్ పోటీపడే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో వీరి భేటీ జరగడం విశేషం.
 
 

>
మరిన్ని వార్తలు