ముంబై, మంగళూరులకు ముప్పు!

19 Nov, 2017 03:19 IST|Sakshi

కాకినాడకూ ప్రమాదమే వందేళ్లలో అసాధారణంగా

పెరగనున్న సముద్ర మట్టాలు

మంచు పలకలు కురుగుతుండటమే కారణం

నాసా అధ్యయనంలో వెల్లడి

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: నానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల తీరప్రాంత నగరాలైన ముంబై, మంగళూరుకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది. సముద్ర తీరాలు కుచించుకుపోవడం వల్ల భూమ్యాకర్షణ, భ్రమణ శక్తులు ప్రభావితమవుతాయని, సముద్ర మట్టాల పెరుగుదలల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 100 ఏళ్లలో మంగళూరు సముద్ర మట్టం 15.98 సెం.మీ., ముంబైలో అయితే 15.26 సెం.మీ.లు పెరుగుతుందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి(15.16 సెం.మీ.) ఇదే తరహా ముప్పు ఉందని అంచనా వేసింది. భూతాపంతో తీర ప్రాంతాల్లోని నగరాల పరిస్థితి ఏమిటన్న విషయంపై నాసా పరిశోధనలు ప్రారంభించింది. శాస్త్రవేత్తలు ‘గ్రేడియంట్‌ ఫింగర్‌ ప్రింట్‌ మ్యాపింగ్‌’ అనే పరికరాన్ని రూపొందించారు. మంచు పర్వతాలు ఏ మేరకు కరుగుతున్నాయి? తద్వారా ఏయే దేశాల్లో ఎంత మేరకు సముద్ర మట్టం పెరుగుతోంది? అనే విషయాలను గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 293 తీర ప్రాంత నగరాలపై ఈ అధ్యయనం జరిపారు. ‘ రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని వరదల ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు రూపొందించాలి’ అని నాసా శాస్త్రవేత్త ఎరిక్‌ ఇవిన్స్‌ అభిప్రాయపడ్డారు.

అక్కడా మంచు కరుగుతోంది...  
ఇటీవలి కాలంలో గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికాల్లో మంచు చాలా వేగంగా కరగడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే 2100 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సముద్రమట్టం 0.51 నుండి 1.31 మీటర్ల మేర పెరగనుందని జీఎఫ్‌ఎం తెలిపింది. అదే కనుక జరిగితే భారత్‌లో దాదాపు 14వేల చదరపు కిలోమీటర్ల మేర భూమి సముద్రంలో కలసిపోనుంది. అదే జరిగితే భారత్‌కు సంభవించే నష్టాన్ని అంచనా కూడా వేయలేమని నాసా గుదిగుచ్చింది. కాగా, మంగళూరు, ముంబైకి ముప్పుపై నాసా ఇచ్చిన నివేదికకు సంబంధించి అధికారిక సమాచారం తమ వద్ద లేదని ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు