‘నాసా.. విక్రమ్‌కు సిగ్నల్స్‌ పంపుతోంది’

12 Sep, 2019 19:50 IST|Sakshi

న్యూఢిల్లీ : చంద్రుడి ఉపరితలంపై హార్డ్ ల్యాండింగ్ అయిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాల పునురుద్ధరణకై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇస్రో తెలిపింది. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీ విక్రమ్‌కు రేడియో సిగ్నల్స్‌ పంపుతున్నట్లుగా ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ‘మూన్‌ ల్యాండర్‌ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సూర్యుడి వెలుగులో సెప్టెంబరు 20-21 దాకా విక్రమ్‌ ల్యాండ్‌ అయిన చోట సిగ్నల్స్‌ కోసం అన్వేషిస్తాం’ అని సదరు అధికారి తెలిపారు. 

కాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో చివరిక్షణంలో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎంతో ఉత్కంఠగా ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలతో పాటుగా యావత్‌ భారతావని ఒక్కసారిగా నిరాశకు గురైంది. ఈ క్రమంలో విక్రమ్‌ హార్డ్ ల్యాండింగ్‌ అయినప్పటికీ ధ్వంసం కాలేదని ఇస్రో ప్రకటించడంతో చంద్రయాన్‌-2 విజయంపై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.

మరిన్ని వార్తలు