నిర్భయకు ఘన నివాళులు

17 Dec, 2013 01:19 IST|Sakshi
నిర్భయకు ఘన నివాళులు

ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా వీధినాటకాలు, కొవ్వొత్తుల ర్యాలీలు
 ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న బాధితురాలి తల్లిదండ్రులు


సరిగా ఏడాది కిందట దుండగుల కీచకానికి బలైన ‘నిర్భయ’కు ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ప్రజలు సోమవారం నివాళులర్పించారు. పలుచోట్ల వీధినాటకాలు వేశారు. కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్ 16న మిత్రుడితో కలసి బస్సులో ప్రయాణించిన 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే.

దారుణమైన అత్యాచారానికి గురైన ఆమె, పదమూడు రోజులు నరకయాతన అనుభవించి, సింగపూర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. ఢిల్లీ ప్రజలు ఆ దారుణాన్ని ఇప్పటికీ మరువలేదు. దక్షిణ ఢిల్లీలో సంఘటన జరిగిన రోజున బాధితురాలు ప్రయాణించిన సాకేత్-మహీపాలపూర్ మార్గంలో వందలాది మంది యువతీ యువకులు ర్యాలీ నిర్వహించారు. బాధితురాలు ప్రైవేటు బస్సు ఎక్కిన మునిర్కా బస్టాప్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ‘నిర్భయ’ స్మారకార్థం  ఏర్పాటు చేసిన ఒక ప్రార్థన కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇప్పటికీ తమకు న్యాయం దక్కలేదని, సంఘటన జరిగినప్పుడు మైనర్‌గా ఉన్న నిందితుడికి కూడా మరణశిక్ష విధించాలని ‘నిర్భయ’ తండ్రి అన్నారు. తన కుమార్తెను తలచుకుని ఆమె తల్లి కన్నీరు మున్నీరయ్యారు. కోల్‌కతా, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లోనూ ‘నిర్భయ’కు నివాళిగా  ర్యాలీలు, వీధినాటక ప్రదర్శనలు జరిగాయి.  

 ఎందుకు పదే పదే గుర్తుచేస్తారు..?: బాలనేరస్తుడు

 ఏడాది కిందట సంఘటన జరిగిన రాత్రిని తాను మరచిపోవాలనుకుంటున్నానని, అయితే, మీడియా ప్రతినిధులు పదే పదే అదే సంఘటనను ఎందుకు గుర్తు చేస్తారని ‘నిర్భయ’ కేసులోని బాల నేరస్తుడు ప్రశ్నించాడు. ఆ కేసులో దోషులుగా తేలిన మిగిలిన నలుగురు నిందితులకు మరణశిక్ష పడగా, సంఘటన జరిగిన నాటికి మైనర్ అనే కారణంతో అతడు మూడేళ్ల శిక్షతో తప్పించుకోగలిగాడు. ప్రస్తుతం అతడికి పద్దెనిమిదేళ్లు నిండాయి.కారాగారం నుంచి అతడిని విడుదల చేస్తే, ఎవరైనా అతడి ప్రాణాలు తీసే అవకాశాలు ఉన్నాయని అతడిని పర్యవేక్షించే కారాగారం అధికారులు చెప్పారు.

 ఇకపై మొబైల్‌లో ‘ఎస్‌ఓఎస్’: చిదంబరం

 మహిళల రక్షణ కోసం రూ.వెయ్యి కోట్లతో ఏర్పాటు చేసిన ‘నిర్భయ’ నిధి వివరాలను కేంద్ర  చిదంబరం వెల్లడించారు. ఆపదలో ఉన్న మహిళలకు సత్వరమే పోలీసుల సాయం లభించేందుకు వీలుగా మొబైల్ ఫోన్ల తయారీదారులు ఇకపై ప్రతి మొబైల్‌లోనూ ‘ఎస్‌ఓఎస్’ (ఆపదలో ఉన్నాం... రక్షించండి) సందేశాన్ని పంపే బటన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలి దశలో ఈ పథకాన్ని 55 నగరాల్లో, రెండో దశలో 102 నగరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు  తెలిపారు.
 

మరిన్ని వార్తలు