దేశవ్యాప్తంగా ముస్లిం సోదరుల ప్రార్థనలు

26 Jun, 2017 10:34 IST|Sakshi
న్యూఢిల్లీ: ఈద్-ఉల్‌-ఫితర్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులు సోమవారం దేశవ్యాప్తంగా మసీదుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అన్ని ప్రాంతాల్లోని  ప్రార్థనాలయాల వద్ద ప్రత్యేక నమాజులు చేసి అల్లాను ప్రార్థించారు.  మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పిల్లా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి మసీదులకొచ్చి ప్రార్థనలు జరిపారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దీంతో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో నగరాలతో పాటు చిన్నా, పెద్ద పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే సందడి నెలకొంది.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరిగాయి. అలాగే పవిత్ర రంజాన్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మసీదుల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు అలాయ్‌ భలాయ్‌ తీసుకుంటున్నారు. రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు.
 
ఈ సందర్భంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ రంజాన్‌ వేడుకలు ప్రశాంతంగా జరిగిలే అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదివేల మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, స్పెషల్‌ పోలీస్‌ టీమ్‌లను కూడా రంగంలోకి దింపామన్నారు. ప్రార్థనా మందిరాల దగ్గర సీసీ టీవీలు ఏర్పాటు చేసి... పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
మరిన్ని వార్తలు