ఎక్కడెక్కడ.. ఎవరెవరు గెలిచారు?

16 Feb, 2016 17:39 IST|Sakshi
ఎక్కడెక్కడ.. ఎవరెవరు గెలిచారు?

దేశంలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం నాడు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. రెండుచోట్ల మాత్రం కాంగ్రెస్ గెలిచింది. టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, ఆర్ఎల్ఎస్‌పీ, సీపీఎం, శివసేన తలో సీటును గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటిలో ముజఫర్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్ దేవ్ అగర్వాల్ విజయం సాధించారు. బికాపూర్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి ఆనంద్ సేన్, దేవ్‌బంద్‌లో కాంగ్రెస్ నేత మావియా అలీ గెలిచారు. కర్ణాటకలోనూ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ రెండుచోట్ల బీజేపీ గెలిచింది. దేవదుర్గలో శివన గౌడ నాయక్, హెబ్బల్‌లో వై.ఎ. నారాయణస్వామి విజయం సాధించారు. బీదర్ స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రహీం ఖాన్ విజయం సాధించారు.

తెలంగాణలో ఒకే స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా, ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి విజయం సాధించారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానంలో అకాలీదళ్ అభ్యర్థి రవీందర్ సింగ్, మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో బీజేపీ అభ్యర్థి నారాయణ్ త్రిపాఠీ, బిహార్‌లోని హర్లాఖిలో ఆర్ఎల్‌ఎస్‌పీ అభ్యర్థి సుధాంశు శేఖర్, త్రిపురలోని అమర్‌పూర్‌లో సీపీఎం అభ్యర్థి పరిమల్ దేవ్‌నాథ్, మహారాష్ట్రలోని పాలఘర్‌లో శివసేన అభ్యర్థి అమిత్ కృష్ణ విజయం సాధించారు.

మరిన్ని వార్తలు