జాతీయ అవార్డుల్లో మెరిసిన ‘క్వీన్’!

25 Mar, 2015 02:42 IST|Sakshi
జాతీయ అవార్డుల్లో మెరిసిన ‘క్వీన్’!

కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు
ఉత్తమ హిందీ చిత్రంగా క్వీన్
ఉత్తమ తెలుగు చిత్రంగా చందమామ కథలు

 
న్యూఢిల్లీ: అరవై రెండో జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెంగాలీ చిత్రాలకు పంట పండింది. ఏడుకు పైగా బెంగాలీ సినిమాలు అవార్డుకు ఎంపికయ్యాయి. షేక్‌స్పియర్ నాటకం హామ్లెట్ ఆధారంగా షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా హైదర్‌కు ఐదు అవార్డులు లభించాయి. - హిందీ సినిమా క్వీన్‌లో అద్భుతంగా నటించిన కంగనా రనౌత్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. నాను అవనాళ్ల అవలు(నేను అతడు కాదు, ఆమెను) సినిమాలో హిజ్రాపాత్రలో ఒదిగిపోయిన కన్నడ నటుడు సంచారి విజయ్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుపొందారు.

న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ చైతన్య తమానే రూపొందించిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ప్రియాంక చోప్రా నటించిన హిందీ సినిమా ‘మేరీ కోమ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ‘62వ జాతీయ చలన చిత్ర అవార్డులు-2014’ను మంగళవారం ఢిల్లీలో అవార్డుల జ్యూరీ చైర్మన్ జి. భారతీరాజా ప్రకటించారు. ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగుచిత్రంగా ‘చందమామ కథలు’, సినీ రచయిత పసుపులేటి పూర్ణచంద్రారావు ‘సెలైంట్ సిని మా (1895-1930)’గ్రంథానికి గాను ఉత్తమ సినీగ్రంథ అవార్డు, ఉత్తమ ప్రచురణ సంస్థగా ‘ఎమెస్కో’ బుక్స్, అలాగే, నల్లమూతు సుబ్బయ్య దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఫోర్స్- ఇండియాస్ వెస్టర్న్ ఘాట్స్’ సినిమా ఉత్తమ పరిశోధనాత్మక చిత్రంగా ఎంపికైంది.
 

మరిన్ని వార్తలు