‘ప్రింట్‌’పై సుంకం కొరడా! 

7 Jul, 2019 03:04 IST|Sakshi

ఇప్పటికే కొండెక్కిన న్యూస్‌ ప్రింట్‌ ధర 

డిజిటల్‌ పోటీతో తగ్గుతున్న ప్రకటనలు 

వీటన్నిటికీ తోడు ఏకంగా 10 శాతం సుంకం 

ఇది మరింత ఇబ్బందికరమంటున్న సంఘాలు 

(సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి): ఒకవైపు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్న డాలర్‌–రూపాయి విలువతో ఆందోళన చెందుతున్న ప్రింట్‌ మీడియాపై... శుక్రవారం నాటి బడ్జెట్‌ మరో బండను పడేసింది. దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్‌పై 10 శాతం సుంకం విధించడం ఈ రంగంపై తీవ్రమైన ప్రభావాన్నే చూపించనుంది. ఎందుకంటే ఒకవైపు డిజిటల్‌ మీడియా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో ప్రింట్‌ మీడియాకు ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా విదేశాల్లో సైతం న్యూస్‌ప్రింట్‌ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతేడాది ఒకదశలో టన్ను న్యూస్‌ప్రింట్‌ ధర 820 డాలర్లకు కూడా చేరింది. ఆ దెబ్బకు కొన్ని చిన్న పత్రికలు మూతపడ్డాయి కూడా.

అక్టోబర్‌ తరువాత కొంత దిగిరావటం మొదలై.... రెండు నెలల కిందట ధరలు కాస్త స్థిరపడి.. ప్రస్తుతం టన్ను న్యూస్‌ప్రింట్‌ ధర 700 డాలర్లకు అటూఇటుగా ఉంది. నిజానికి చాలా వరకూ పత్రికలు తక్షణ ఇబ్బందులు రాకుండా ఐదారు నెలలకు సరిపడా నిల్వల్ని ముందే తెచ్చుకుని పెట్టుకుంటాయి. కాబట్టి తగ్గిన ధరల తాలూకు ఫలితం వాటికింకా అందలేదనే చెప్పాలి. పోనీ ఇప్పుడైనా ఉపశమనం దొరుకుతుందని భావించిన ప్రింట్‌ మీడియాపై శుక్రవారం నాటి బడ్జెట్‌ ఏకంగా బాంబునే వేసింది. ఇప్పటిదాకా వీటిపై దిగుమతి సుంకం లేకపోగా... ఒకేసారి 10 శాతం విధించటం గమనార్హం. ఈ చర్యతో మరిన్ని చిన్న, భాషా పత్రికలు మూతపడవచ్చనే ఆందోళన నెలకొంది.
 
‘‘ప్రకటనల ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఆశించిన సాయం అందించకపోగా ప్రభుత్వం ఇలా సుంకాలు మోపి దెబ్బతీయడం దురదృష్టకరం’’అని భారతీయ భాషా పత్రికల సంఘం (ఐఎల్‌ఎన్‌ఏ) అధ్యక్షుడు పరేష్‌నాథ్‌ తప్పుబట్టారు. ఆంగ్ల పత్రికలకు ప్రయివేట్‌ ప్రకటనలు, టెండర్‌ నోటిఫికేషన్ల రూపంలో ఆదాయం బాగానే వస్తుందని, దేశవ్యాప్తంగా విస్తరించిన చిన్న, మధ్య స్థాయి భాషా పత్రికలు ఈ భారాన్ని మోయలేవని ఆయన చెప్పారు. తక్కువ నాణ్యతతో, ఎక్కువ లాభాలు ఆర్జించాలని దేశీ న్యూస్‌ప్రింట్‌ తయారీదారులు ఆలోచిస్తున్నారని, వారి ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం దిగుమతి సుంకం విధించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఈ సుంకాన్ని తక్షణం తొలగించాలని, తన చర్యను వెనక్కి తీసుకోవాలని ఆయన  డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు