పొగతాగడం హానికరం..మరి ఆ నీటి సంగతి..?

27 Jul, 2018 17:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గంగా నది కాలుష్యంపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీవ్రంగా స్పందించింది. సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరమైతే కాలుష్య జలాల్లో మునిగితే వచ్చే ప్రతికూల పర్యవసానాలపై ప్రజలను ఎందుకు హెచ్చరించరని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)  ప్రశ్నించింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి యూపీలోని ఉన్నావ్‌ వరకూ నదీ జలాలు తాగేందుకు, స్నానం చేసేందుకు ఎంతమాత్రం పనికిరావని ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌ ఏకే గోయల్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

కలుషిత గంగా నీరు ఆరోగ్యంపై చూపే దుష్ర్పభావాల గురించి తెలియని ప్రజలు వాటిని తాగడం, స్నానం చేయడం చేస్తున్నారని పేర్కొంది. గంగా జలాలను పవిత్రంగా భావించే ప్రజలు కలుషిత నీటిని సేవించకుండా వారికి అవగాహన కల్పించాల్సి ఉందని గోయల్‌ అన్నారు. ప్రతి వంద కిలోమీటర్లకు గంగా నదీ జలాలు ప్రజలు సేవించేందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది తెలుపుతూ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగ (ఎన్‌ఎంసీజీ)ను ఆదేశించింది.

గంగా నదీ జలాలు ఎక్కడెక్కడ తాగేందుకు, స్నానం చేసేందుకు అనువుగా ఉన్నాయో తెలుపుతూ తమ వెబ్‌సైట్‌లో రెండు వారాల్లోగా మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని ట్రిబ్యునల్‌ ఎన్‌ఎంసీజీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని కోరింది.

మరిన్ని వార్తలు