రాహుల్, సోనియాలకు షాక్‌

5 Dec, 2018 02:04 IST|Sakshi

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో..

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల 2011–12 ఏడాది ఆదాయ పన్ను రిటర్నులను తిరిగి మదించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణలో భాగంగా మంగళవారం ఈ ఆదేశాలిచ్చింది.  రాహుల్, సోనియాల పన్ను రిటర్నులను పరిశీలించి ఆదేశాలు జారీచేయొచ్చు కానీ, విచారణ జరిగే తదుపరి తేదీ వరకు వాటిని అమలుచేయరాదని ఆదాయ పన్ను శాఖకు సూచించింది. రాహుల్, సోనియాలకు వ్యతిరేకంగా మదింపు ఉత్తర్వులను అమలుచేయొద్దని కోర్టు ఆదేశించడంపై ఐటీ విభాగం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా, రాహుల్‌ల పిటిషన్‌ మెరిట్‌ను నిర్ధారించాలంటే లోతుగా పరిశీలించాలని పేర్కొంది. 

కేసు అసలు సంగతి.. 
నేషనల్‌ హెరాల్డ్‌ కేసుగా పేరొందిన ఈ మొత్తం వ్యవహారంలో సోనియా, రాహుల్‌కు 2015, డిసెంబర్‌లో బెయిల్‌ దొరికింది. బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఓ ట్రయల్‌ కోర్టుకు చేసిన ఫిర్యాదు ఆధారంగా సోనియా, రాహుల్‌ల ఆదాయ పన్ను రిటర్నులను పునఃమదించేందుకు ఐటీ విభాగం సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ వారు దాఖలుచేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు ప్రకారం..కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీసుకున్న రూ.90.25 కోట్ల వడ్డీ రహిత రుణాన్ని అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌) తిరిగి చెల్లించలేకపోయింది. 2010లో కాంగ్రెస్‌ స్థాపించిన యంగ్‌ ఇండియా(వైఐ) అనే సంస్థకు ఏజేఎల్‌ షేర్లు, ఆస్తుల్ని బదిలీచేయడం ద్వారా సోనియా, రాహుల్‌ భారీ ఆర్థిక అవకతవకలు, మోసానికి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. 

మరిన్ని వార్తలు