ఆత్మీయ పులకరింత

21 Jan, 2019 08:43 IST|Sakshi

నేడు అంతర్జాతీయ ఆలింగన దినోత్సవం

నీకోసం నేనున్నాను..అనే భావనను కలగజేయడానికి ఆలింగనం ద్వారా తెలియపర్చవచ్చు. కౌగిలింత మధురమైన అనుభూతి. విడదీయరాని బంధానికి చిహ్నం. ఆపదలో, ఆనందంలో, దుఃఖంలో సాంత్వన చేకూర్చేదే కౌగిలింత. అన్నదమ్ముళ్లు, అన్నాచెల్లెలు, అక్కా చెల్లెలు, ప్రియుడు ప్రియురాలు, భార్య భర్తలు, స్నేహితులు ఒకరికొకరు అప్పుడప్పుడు కౌగిలించుకుంటారు. ప్రేమాభిమానాలను మనస్ఫూర్తిగా వ్యక్తం చేసేందుకు ఆలింగనం తోడ్పడుతుంది. విజయదశమి, రంజాన్‌ మొదలగు పర్వదినాల్లో కులాలకు, మతాలకు అతీతంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటారు. శుభకార్యాల్లో కూడా కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. 

కౌగిలించుకునే వ్యక్తుల శరీరంలో హర్మోన్ల ప్రభావం వల్ల విడుదలయ్యే ఎండార్పిన్లు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులకు కేవలం మందులు ఇచ్చినంత మాత్రన వారు వెంటనే ఆరోగ్యవంతులు కారు. ప్రేమ, ఆప్యాయతతో చెప్పే మాటలు వారికి సాంత్వన చేకూరుస్తాయి. ఇంట్లో చిన్నపిల్లలు భయపడితే వీపుపై ఆప్యాయతతో నిమురటం వల్ల వెన్నెముకలో తాత్కలికంగా నిక్షిప్తమైన ఓ రకమైన షాక్‌ మాయమయ్యేందుకు ఇలా చేస్తారు. ఆ పిల్లవాడిని కౌగిలించుకుని ధైర్యం చెబితే టచ్‌ థెరపిలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు. 

బంధాలు మరింత బలోపేతం 
ఆలింగనం ద్వారా వ్యక్తుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. స్నేహితులతో అనేక విషయాలు చర్చిస్తాం. ఇంట్లో భార్య పిల్లలతో చెప్పని విషయాలు కూడా స్నేహితులకు చెప్తాం. ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటారు. అలాగే ఎన్ని జన్మలైనా నీతోనే ఉంటాను..భార్య భర్తల మ«ధ్య ఉండే సాన్నిహిత్యానికి ఈ కౌగిలింత సంకేతం. తండ్రి కొడుకుల మ«ధ్య కూడా దాపరికాలు లేకుండా ఆలోచనలు పంచుకుంటారు.

ఇకపోతే ప్రేమికులు ఒకరికొకరు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేది ఆలింగనం. ప్రేమికుల కౌగిలింత అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. అక్కాచెల్లెలు కూడా అమ్మ నాన్నలతో పంచుకోలేని భావాలను హుందాగా మెరుగుపర్చేదే అక్కాచెల్లెల ఆలింగనం. అన్నదమ్ముల మధ్య కూడా అసూయ, ధ్వేషం, అహంకారం వంటి దుర్గుణాలను దూరం చేసుకునేందుకు రామాయణంలో మాదిరిగా రామలక్ష్మణుల ఆత్మీయ ఆలింగనం పలుచోట్ల కనపడుతుంది. అంతేకాకుండా వివిద దేశాధినేతలు కూడా దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు కౌగిలింత ఎంతగానో తోడ్పడుతుంది. 

అమెరికాలో ప్రారంభం  
పాశ్చాత్య దేశాల్లో ప్రతి సంవత్సరం కౌగిలింతల వారోత్సవాలు జరుపుకుంటారు. అమెరికాలో కేవిన్‌ జాబోర్ని కౌగిలింత సంప్రదాయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఇరాన్, రష్యా, పోలాండ్, జర్మని, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాలు వ్యాపించింది. 

అనేక లాభాలు  
ఆలింగనంతో అనేక లాభాలున్నాయి. స్పర్శతోనే ఎదుటివారి పట్ల ఆత్మీయతను ప్రకటించే దివ్య ఔషధం ఆలింగనం.మందులతో నయం కాని జబ్బులను ఆత్మీయ ఆలింగనంతో తగ్గించవచ్చునని పరిశోధనలు చెబుతున్నాయి. మానవ సంబంధాల్లో అన్యోనతను సూచించేందుకు కౌగిలింత ఎంతగానో తోడ్ప డుతుంది. భార్య భర్తల మధ్య దాంపత్య జీవితం సజావుగా సాగుతుంది. మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. ఒకరిపై ఒకరికి ప్రేమ, విశ్వాసాన్ని కలిగిస్తుంది. కష్టాల్లో ఉన్నవారిని కౌగిలించుకుంటే వారికి కొండంత అండ ఇచ్చినట్లు అవుతుంది. సత్సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు భావోద్వేగాలను సమన్వయపర్చుకునేందుకు ఎంతగానో తోడ్ప డుతుంది.  
 

మరిన్ని వార్తలు