కశ్మీర్‌ విద్యార్థులపై దాడులు.. హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

21 Feb, 2019 19:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: కశ్మీర్‌ విద్యార్థులపై దాడుల విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్‌ అయింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ అంశంపై జవాబు చెప్పాలని నోటీసులు పంపింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులిచ్చింది.  విద్యార్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించింది. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమని చెప్పింది.

ఇటువంటి దాడుల వల్ల ప్రపంచ దేశాల్లో భారత దేశ గౌరవం మంటగలిసే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం కశ్మీర్‌ విద్యార్థుల్లో కొందరు ఉగ్రదాడిని సమర్ధిస్తూ సోషల్‌ మీడియాలో వార్తలు పోస్ట్‌ చేయడం..పలు రాష్ట్రాల్లో కొందరు కశ్మీర్‌ విద్యార్థులపై దాడులు చేస్తామంటూ వారికి వ్యతిరేకంగా మాట్లాడటం తెలిసిందే. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా దాడులు చేస్తామన్న వారిని సమర్ధించడంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మానవ హక్కుల సంఘం స్పందించింది.

మరిన్ని వార్తలు