లాక్‌డౌన్‌ పొడిగింపునకే మొగ్గు!

12 Apr, 2020 04:43 IST|Sakshi
లాక్‌డౌన్‌ కారణంగా కోల్‌కతాలో తన ఇంటి నుంచి బయటకు చూస్తున్న వృద్ధుడు

ఈ విషయంలో ముఖ్యమంత్రుల్లో ఏకాభిప్రాయం ఉంది

సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రక్కసిని పూర్తిగా అంతమొందించేందుకు ఏప్రిల్‌ 14వ తేదీ తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. లాక్‌డౌన్‌ను కనీసం 2 వారాలైనా కొనసాగించేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు స్పష్టమవుతోందని ప్రధాని పేర్కొన్నారు. కోవిడ్‌ –19పై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఇతర శాఖల సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలను తగినన్ని అందుబాటులో ఉంచుతామని ప్రధాని సీఎంలకు వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  లాక్‌డౌన్‌ కారణంగా కుదేలయిన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను ఆదుకునేందుకు, కోవిడ్‌–19పై పోరు కొనసాగించేందుకు కేంద్రం సాయం అందించాలని పలువురు సీఎంలు ప్రధానిని అభ్యర్థించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని సంపూర్ణంగా అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను కొనసాగించడమే అత్యుత్తమ, ఏకైక మార్గమని పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అమరీందర్‌ సింగ్, అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానికి సూచించారు.

ఏప్రిల్‌ ఆఖరు దాకా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని వారు ప్రధానికి సూచించారు. పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తెల్లని వస్త్రంతో చేసిన మాస్క్‌ను ధరించగా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా మాస్క్‌లతో ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలను ఇచ్చాయన్నది రానున్న 3, 4 వారాల్లో తేలుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

వైరస్‌ను పూర్తిగా రూపుమాపేందుకు రానున్న 3, 4 వారాలు అత్యంత కీలకమన్నారు.  ఈ కాన్ఫరెన్స్‌లో మమతా బెనర్జీ (బెంగాల్‌), యోగి ఆదిత్యనాథ్‌(ఉత్తరప్రదేశ్‌), ఉద్ధవ్‌ ఠాక్రే(మహారాష్ట్ర), ఎంఎల్‌ ఖట్టర్‌(హరియాణా), నితీశ్‌కుమార్‌(బిహార్‌) తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కొన్ని ఆంక్షల సడలింపుతో లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నారన్న వార్తల నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది.

ప్రాణాలూ ముఖ్యమే.. అభివృద్ధీ ముఖ్యమే
మొదట లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వాల ప్రాథామ్యమని చెప్పామని, అయితే, ఇప్పుడు ప్రభుత్వాల లక్ష్యం ప్రాణాలను కాపాడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటం కూడా అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్న సమయంలో ప్రాణాలు ఉంటేనే అభివృద్ధి అన్నాను. నా మాటలను అర్థం చేసుకున్న దేశప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను అద్భుతంగా పాటించారు. ఇప్పుడు ప్రాణాలతో పాటు దేశాభివృద్ధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’ అన్నారు. కరోనా కట్టడిలో  కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు.

ఔషధాలు, నిత్యావసర వస్తువులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని, వాటిని అక్రమంగా నిల్వ చేస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వైద్య సిబ్బంది, ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌ విద్యార్థులపై దాడులను ప్రధాని ఖండించారు.  కోవిడ్‌ 19కి చికిత్స లేనందున భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పని సరి అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం కావడానికి  ఈ సంక్షోభాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు